కెమికల్స్, పెట్రో సాయం!

India's exports grew by 25.67 per cent in September

సెప్టెంబర్‌లో 26 శాతం ఎగసిన ఎగుమతులు

దిగుమతులూ 18 శాతం అప్‌

వాణిజ్యలోటు 9 బిలియన్‌ డాలర్లు

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు సెప్టెంబర్‌లో 25.67 శాతం పెరిగాయి. ఇది ఆరు నెలల గరిష్ట స్థాయి.  విలువ రూపంలో 28.61 బిలియన్‌ డాలర్లు.  రసాయనాలు (46 శాతం), పెట్రోలియం (37 శాతం), ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల (44 శాతం) ఎగుమతుల్లో భారీ వృద్ధి మొత్తం గణాంకాలకు సానుకూలమయ్యాయి. అయితే హస్తకళలు, ముడి ఇనుము, పండ్లు, కూరగాయల ఎగుమతులు అసలు పెరక్కపోగా 2017 సెప్టెంబర్‌కన్నా క్షీణించాయి.  శుక్రవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ సెప్టెంబర్‌ ఎగుమతులు–దిగుమతుల అధికారిక గణాంకాలను విడుదల చేసింది.

దిగుమతులు చూస్తే...: దిగుమతులూ 18 శాతం ఎగశాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో 31.83 బిలియన్‌ ఉన్న దిగుమతుల విలువ 2017 సెప్టెంబర్‌లో 37.6 బిలియన్‌ డాలర్లకు చేరాయి. చమురు దిగుమతులు 18.47 శాతం పెరుగుదలతో 8.18 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. చమురుయేతర దిగుమతులు 18 శాతం పెరిగి 29.4 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

వాణిజ్యలోటు యథాతథం...
ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు దాదాపు నిశ్చలంగా ఉంది. 2017 సెప్టెంబర్‌లో 8.98 బిలియన్‌ డాలర్లుగా వాణిజ్యలోటు నమోదయ్యింది. 2016 సెప్టెంబర్‌లో ఈ విలువ 9 బిలియన్‌ డాలర్లు.

పసిడి దిగుమతులు 5 శాతం డౌన్‌..!
పసిడి దిగుమతులు ఐదు శాతం పతనమయ్యాయి. 1.71 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

వృద్ధి బాటకు ఎగుమతులు
వరుసగా పదమూడు నెలల నుంచీ ఎగుమతులు  మొత్తంగా సానుకూల వృద్ధిని నమోదుచేసుకుంటున్నాయి. ఎగుమతులు తిరిగి వృద్ధి గాటన పడ్డాయనడానికి ఇది ఉదాహరణ.    – సురేశ్‌ ప్రభు, వాణిజ్యశాఖ మంత్రి

మరింత ముందుకు...
జీఎస్‌టీకి సంబంధించి ఆందోళనలను పరిష్కరించడంలో కేంద్రం ముందుకు రావడం ఎగుమతుల వృద్ధికి ఒక కారణం. అంతర్జాతీయ అనిశ్చితి, రూపాయి ఒడిదుడుకులు, రక్షణాత్మక విధానాలు ఎగుమతులకు సవాళ్లను విసిరే అంశాల్లో కొన్ని. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల విలువ 310 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని భావిస్తున్నాం.    – గణేశ్‌ గుప్తా, ఎఫ్‌ఐఈఓ ప్రెసిడెంట్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top