బొమ్మ బంపర్‌ హిట్‌!

Indian box office crosses Rs 10,000 crore mark in 2019  - Sakshi

టికెట్ల అమ్మకాలు రయ్‌రయ్‌...

గతేడాది 103 కోట్ల టికెట్లు సేల్‌

రూ.10,948 కోట్లు వెచ్చించిన సినీ ప్రియులు

పైరసీతో సినీ రంగం నష్టపోతోందంటూ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. థియేటర్లకు వెళ్లి చూసే ప్రేక్షకుల సంఖ్యేమీ తగ్గడం లేదు. సినిమా కలెక్షన్లు అలవోకగా వందల కోట్లు దాటడమూ ఆగడం లేదు. ఆర్థిక వ్యవస్థలో మందగమనం భయాల్లాంటివి ఎలా ఉన్నా .. సినీ ప్రేమికులు రేటెంతైనా సరే టికెట్టు కొనుక్కుని చూసేందుకు మొగ్గుచూపుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. గతేడాదే సినిమాలపై ప్రేక్షకులు ఏకంగా రూ. 10వేల కోట్లపైగానే వెచ్చించారు.

న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉంటున్న సినిమా టికెట్ల అమ్మకాలు మళ్లీ జోరు అందుకుంటున్నాయి. పైరసీ కష్టాలు ఎలా ఉన్నా.. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌ తేడా లేకుండా సినీ ప్రియులు .. రేటెంతయినా సరే టికెట్లు కొనుక్కుని థియేటర్లలో చూసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. గతేడాది గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఒర్మాక్స్‌ మీడియా అనే కన్సల్టింగ్‌ సంస్థ రూపొందించిన బాక్సాఫీస్‌ రిపోర్ట్‌ 2019 ప్రకారం.. భారతీయులు గతేడాది 103 కోట్ల సినిమా టికెట్లు కొనుగోలు చేశారు. ఇందుకోసం దాదాపు రూ. 10,948 కోట్లు వెచ్చించారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 11.6 శాతం అధికం. 2018లో దేశీ సినీ ప్రియులు 94.5 కోట్ల టికెట్లు కొనుగోలు చేశారు. ఇందుకోసం రూ. 9,810 కోట్లు వెచ్చించారు. అమ్ముడైన టికెట్లలో దాదాపు మూడో వంతు వాటా హిందీ సినిమాలదే ఉంది. 19 శాతం తమిళ సినిమాలు, 18 శాతం తెలుగు సినిమాల వాటా ఉంది. హాలీవుడ్, మలయాళం సినిమాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం..

సినిమాలు బంపర్‌ కలెక్షన్లు సాధించడంలో భాష ప్రధానంగా ఉంటోంది. ప్రభాస్‌ నటించిన సాహో (హిందీ, తమిళం, తెలుగు) బాక్సాఫీస్‌ ఆదాయాల్లో అత్యధికంగా 60 శాతం వాటా హిందీ నుంచే వచ్చినట్లు ఒర్మాక్స్‌ మీడియా సీఈవో శైలేష్‌ కపూర్‌ పేర్కొన్నారు. ఇక హృతిక్‌ రోషన్‌ నటించిన బాలీవుడ్‌ సినిమా ‘వార్‌’ కలెక్షన్లలో గణనీయ భాగం తెలుగు వెర్షన్‌ నుంచి వచ్చాయని వివరించారు. ఈ నేపథ్యంలో చాలా మటుకు టాప్‌ 10 సినిమాలు.. బహుభాషల్లో విడుదలవుతున్నాయని కపూర్‌ చెప్పారు. హాలీవుడ్‌ సినిమాలు కూడా తెలుగు, తమిళం, హిందీ తదితర పలు భారతీయ భాషల్లోకి డబ్‌ చేస్తున్నారని విశ్లేషించారు. ‘అవెంజర్స్‌ సినిమా బాక్సాఫీస్‌ ఆదాయాల్లో 40–45 శాతం వాటా హిందీ, తెలుగు, తమిళ వెర్షన్లదే ఉంది. భారీ సినిమాలన్నింటికీ ఇది వర్తిస్తుంది. వాటి బాక్సాఫీస్‌ ఆదాయాల్లో సగటున 30–35 శాతం వాటా భారతీయ భాషల వెర్షన్ల నుంచే వస్తోంది. 1917 లాంటి చిన్న సినిమాలు ఇంగ్లీష్‌లో మాత్రమే విడుదలవుతున్నాయి’ అని కపూర్‌ చెప్పారు. హాలీవుడ్‌ చిత్రాలైనా .. బాలీవుడ్‌ సినిమాలైనా .. పలు భాషల్లో డబ్‌ చేసి, విడుదల చేస్తుండటం వల్ల టికెట్ల అమ్మకాలు.. తద్వారా బాక్సాఫీస్‌ ఆదాయాలు పెరుగుతున్నాయి.  

కంటెంటే కింగ్‌..
అయితే, సినిమాల కలెక్షన్లు పెరగడానికి కారణం పలు భాషల్లో రిలీజ్‌ చేయడం ఒక్కటే కాదని, కంటెంట్‌ కూడా బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని నివేదిక విశ్లేషించింది. స్టార్‌ హీరోలు, యాక్టర్లతో సంబంధం ఉండటం లేదని వివరించింది. హిందీ సినిమాలు.. కలెక్షన్ల కోసం తొలి వారాంతంపై ఆధారపడటమనేది దశాబ్దపు కనిష్ట స్థాయికి పడిపోయినట్లు పేర్కొంది. కేవలం తొలి వారానికే పరిమితం కాకుండా కంటెంట్‌ ఎంత బాగుంటే .. అంత ఎక్కువ కాలం థియేటర్లలో సినిమాలు నడుస్తున్నాయి. ‘గతంలో కహానీ (2012), క్వీన్‌ (2014) వంటి సినిమాల్లో పెద్ద స్టార్లు లేకపోయినా అవి రూ. 100 కోట్ల వసూళ్లు సాధించడం గొప్పగా ఉండేది. కానీ 2019 విషయం తీసుకుంటే పెద్ద స్టార్లెవరూ లేని చిచోరే సినిమా అలవోకగా రూ. 140 కోట్ల వసూళ్లు సాధించింది. సల్మాన్‌ ఖాన్‌ వంటి పెద్ద స్టార్‌ నటించిన దబాంగ్‌ 3కి సరిసమాన స్థాయిలో నిల్చింది. కనుక స్టార్లు లేరు కాబట్టి సినిమా వసూళ్లు అంతంత మాత్రంగానే ఉంటాయని అనుకోవడానికి లేదు. కంటెంట్‌ బాగుంటే చాలు.. ఆదాయాలకు ఆకాశమే హద్దుగా ఉంటోంది‘ అని కపూర్‌ చెప్పారు. స్టార్‌ యాక్టర్ల సినిమాలకు సాధారణంగానే మంచి ఓపెనింగ్స్‌ వస్తుంటాయి. కానీ, ఎంత కాలం నిలదొక్కుకోగలుగుతాయి అన్నది కంటెంట్‌ పైనే ఆధారపడి ఉంటోంది. దబాంగ్‌ 3 ఓపెనింగ్స్‌ రూ. 32 కోట్లతో పోలిస్తే చాలా తక్కువగా రూ. 6 కోట్ల ఓపెనింగ్స్‌తో ప్రారంభమైన చిచోరే.. ఆ తర్వాత అదర గొట్టే కలెక్షన్లు సాధించడం దీనికి నిదర్శన మని కపూర్‌ తెలిపారు.

విదేశీ మార్కెట్ల లోనూ దూకుడు..
వసూళ్లు పెంచుకోవడానికి చిత్రాలను విదేశీ మార్కెట్లలోనూ పెద్ద ఎత్తున విడుదల చేసే ధోరణి పెరిగిందని కేర్‌ రేటింగ్స్‌ తెలిపింది. బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ఖాన్‌ నటించిన దంగల్‌ సినిమా దీనికి నిదర్శనంగా పేర్కొంది. మొత్తం రూ. 1,968 కోట్ల వసూళ్లలో నాలుగింట మూడొంతుల వాటా విదేశీ మార్కెట్ల నుంచే వచ్చిందని వివరించింది. చైనా, మధ్యప్రాచ్యం, తైవాన్, మలేషియా, హాంకాంగ్, బ్రిటన్‌ వంటి దేశాల్లో భారతీయ సినిమాలకు ఆదరణ ఉంటోందని కేర్‌ రేటింగ్స్‌ తెలిపింది. మరోవైపు, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ వంటి ఓవర్‌–ది–టాప్‌ కంటెంట్‌ ప్లాట్‌ఫాంల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. థియేటర్లలో టికెట్ల రాబడి కూడా పెరగడం గమనార్హమని వివరించింది. ఒకదాని వల్ల మరో దానికి ముప్పు రాకుండా ఓటీటీ ప్లాట్‌ఫాంలు, థియేటర్లు కలిసి ముందుకు సాగగలవని పేర్కొంది.

బాక్సాఫీస్‌పై ‘లిప్‌స్టిక్‌’ ప్రభావం: కేర్‌
బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు పెరగడానికి ‘లిప్‌స్టిక్‌’ ఎఫెక్ట్‌ కూడా కారణమని రేటింగ్‌ ఏజెన్సీ కేర్‌ రేటింగ్స్‌ ఒక నివేదికలో పేర్కొంది. ఆర్థిక మందగమన పరిస్థితుల్లో వినియోగదారులు .. విలాసవంతమైన భారీ కొనుగోళ్ల జోలికి పోకుండా.. చిన్న చిన్న సరదాలపై ఖర్చు పెట్టే ధోరణిని లిప్‌స్టిక్‌ ఎఫెక్ట్‌గా వ్యవహరిస్తారు. ఈ ప్రభావంతో పాటు కంటెంట్‌ మెరుగుపడటం, సినిమా టికెట్లపై జీఎస్‌టీ తగ్గడం కూడా పరిశ్రమకు తోడ్పడిందని కేర్‌ రేటింగ్స్‌ పేర్కొంది. సినిమాల సగటు ఆదాయం 15 శాతం పెరిగి రూ. 23 కోట్లకు చేరిందని వివరించింది. 2018లో ఏడు చిత్రాలు రూ. 100 కోట్ల వసూళ్ల మార్కును దాటగా 2019లో ఇది పదమూడుకు పెరిగింది. గతేడాది ఆరు బాలీవుడ్‌ సినిమాలు రూ. 200 కోట్ల మార్కును అధిగమించాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top