నోట్ల రద్దు సమస్యల నుంచి భారత్‌ గట్టెక్కుతోంది

India on its way recovering from demonetisation disruptions: IMF - Sakshi

ఐఎంఎఫ్‌ డిప్యూటీ ఎండీ తావో ఝాంగ్‌  

వాషింగ్టన్‌: నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌), వస్తు–సేవల పన్ను(జీఎస్‌టీ) సమస్యల నుంచి భారత్‌ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) పేర్కొంది. అయితే, బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచడం... విద్య, వైద్యం వంటి రంగాల్లో ప్రభుత్వం సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ‘గడిచిన కొన్నేళ్లలో భారత్‌ ఎకానమీ పటిష్ట వృద్ధిని సాధిస్తోంది. సరఫరా సంబంధ అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, నిర్మాణాత్మక సంస్కరణలు, స్థూల ఆర్థిక విధానాలే దీనికి కారణం. అయితే, జీఎస్‌టీ, నోట్ల రద్దు కారణంగా వృద్ధి మందగించింది.

ఇప్పుడు మళ్లీ ఈ ప్రభావం నుంచి గట్టెక్కడంతో డిసెంబర్‌ కార్టర్‌లో జీడీపీ వృద్ధి 7.2 శాతానికి ఎగబాకింది. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని తిరిగి సంపాదించుకోగలిగింది’ అని ఐఎంఎఫ్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌తావో ఝాంగ్‌ చెప్పారు. ఈ నెలలోనే భారత్‌ పర్యటనకు రానున్న నేపథ్యంలో పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశాలను పేర్కొన్నారు. ‘రానున్న కాలంలో ముఖ్యంగా విద్య, వైద్యం వంటి రంగాల్లో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుంది.

అదేవిధంగా ప్రైవేటు, ప్రభుత్వ పెట్టుబడులను ప్రోత్సహించడం, బ్యాంకింగ్‌–ఫైనాన్షియల్‌ వ్యవస్థల సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటివి కూడా చాలా కీలకం. ఈ చర్యలన్నీ సమ్మిళిత, స్థిరమైన ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయి. ధనిక దేశాలతో సమాన స్థాయికి ప్రజల ఆదాయాలు చేరుకునేందుకు బాటలు వేస్తుంది’ అని ఝాంగ్‌ వివరించారు. కాగా, ప్రాంతీయ, ప్రపంచ ఆర్థికాభివృద్ధికి భారత్, చైనాలు అత్యంత ప్రధానమైన చోదకాలని చెప్పారు. బలమైన ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యంతో ఇరు దేశాలకూ ప్రయోజనకరమని ఆయన పేర్కొన్నారు.

మూలధన నిధులపై...: మొండిబకాయిల సమస్య పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న విస్తృత ఫైనాన్షియల్‌ సంస్కరణల్లో భాగంగానే ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన నిధులను(రీక్యాపిటలైజేషన్‌) అందించాలని ఐఎంఎఫ్‌ అభిప్రాయపడింది. బ్యాంకింగ్, కార్పొరేట్‌ రంగాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న తీవ్ర ఇబ్బందులను(మొండిబకాయిలకు సంబంధించి) పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన విధానపరమైన సంస్కరణలు చాలా కీలకమైనవని ఝాంగ్‌ వ్యాఖ్యానించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top