బ్రాండ్లకు అంబాసిడర్ల హవా! | Increased the Brand ambassador values | Sakshi
Sakshi News home page

బ్రాండ్లకు అంబాసిడర్ల హవా!

Jun 17 2015 2:21 AM | Updated on Sep 3 2017 3:50 AM

బ్రాండ్లకు అంబాసిడర్ల హవా!

బ్రాండ్లకు అంబాసిడర్ల హవా!

నెస్లే వివాదంతో కొందరు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించే విషయంలో పునరాలోచనలో పడినా...

ప్రచారకర్తల ఎంపికలో కంపెనీల పోటీ
సెలబ్రిటీలతో దూసుకెళుతున్న ఈ-కామర్స్ సంస్థలు దేశంలో బ్రాండ్ అంబాసిడర్ల విలువ 1,000 కోట్లపైనే వీరికి మార్గదర్శకాలను సిద్ధం  చేయాలంటున్న సీఏఐటీ
 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
నెస్లే వివాదంతో కొందరు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించే విషయంలో పునరాలోచనలో పడినా... భారతీయ మార్కెట్లో వారి హవా మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇపుడు ఏకంగా బ్రాండ్ అంబాసిడర్ల మార్కెట్ విలువ రూ.వెయ్యి కోట్లను దాటిపోయింది. ఒకే రకమైన ఉత్పత్తి వివిధ బ్రాండ్ల నుంచి కుప్పలుతెప్పలుగా వస్తుండటంతో ఏ బ్రాండ్‌ను ఎంచుకోవాలనేది వినియోగదారులకు కష్టమే. ఈ పీటముడిని విప్పేందుకే బ్రాండ్ అంబాసిడర్ అని పిలుచుకునే రాయబారిని నియమిస్తున్నట్లు వ్యాపార సంస్థలు చెబుతున్నాయి. ప్రజల్లో ఎవరికైతే ఎక్కువ ఫాలోయింగ్ ఉందో వారిని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంటే అంత వేగంగా, ఎక్కువగా మార్కెట్ చేసుకోవచ్చనేది వాటి సూత్రం. ‘‘వినియోగదారులను ప్రభావితం చేయగలిగే సత్తా బ్రాండ్ అంబాసిడర్‌కు ఉంటుంది. సదరు అంబాసిడర్‌ను బట్టి కస్టమర్లు తమ ఉత్పత్తిని ఎంపిక చేసుకుంటారు. కాజల్ అగర్వాల్‌కు మహిళల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే మా సంస్థకు ఆమెను రాయబారిగా పెట్టుకున్నాం’’ అనేది గ్రీన్ ట్రెండ్ సెలూన్ సీఈఓ ఎస్ దీపక్ మాట. ఒకప్పుడు బ్రాండ్ అంబాసిడర్‌గా చేయాలంటే చాలామంది భయపడేవారు. ఎందుకంటే సదరు
 
బ్రాండ్  ఉత్పత్తి నాణ్యత ఎలా ఉంటుంది? ప్రజలు ఛీ కొడితే తమకూ చెడ్డపేరొస్తుందా? అనేది బాగా చూసేవారు. కాలక్రమంలో ఆ బ్రాండ్ పుట్టుపుర్వోత్తరాలు, నాణ్యత వంటి విషయాలను పరిశీలించి బ్రాండ్ అంబాసిడర్ల అవతారమెత్తే పరిస్థితి వచ్చింది. కొన్ని సందర్భాల్లో వీటన్నిటినీ మించి వాణిజ్య అంశాలే ప్రధానంగా మారుతున్నాయనేది ఈ రంగంలోని వారి మాట.
 
వినూత్న మార్కెట్ హైదరాబాద్...
బ్రాండ్ అంబాసిడర్ల విషయంలో హైదరాబాద్ రూటే వేరని చెప్పాలి. ఇక్కడ ఆరోగ్యానికో అంబాసిడర్.. భాషకో అంబాసిడర్, రాష్ట్రానికో అంబాసిడర్ ఉన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్‌నే తీసుకుంటే... దీనికి వివిధ రంగాలకు సంబంధించిన సామాన్యులే బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. దీని కోసం 16 వేల మంది పోటీపడగా 24 మందిని ఎంపిక చేశారు. అంతేకాదు. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ క్యాన్సర్ బాధితుల సహాయార్థం బంజారాహిల్స్‌లోని స్పర్శ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. నిన్నటికి నిన్న హెపటైటిస్‌పై అవగాహన ర్యాలీలో వీవీఎస్ లక్ష్మణ్ ప్రచారకర్తగా నిలిచారు.
 ఆరోగ్యానికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా ఆయన ప్రజలకు, నిర్వాహకులకు మధ్య రాయబరిగా మారిపోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సానియా మీర్జా అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటం తెలిసిందే.
 
ఒకే ఉత్పత్తి... వేరువేరు రాయబారులు
ఒకే ఉత్పత్తికి వివిధ భాషలకు వేర్వేరు అంబాసిడర్లను నియమించుకునే సంస్కృతి ఈ మధ్య బాగా పెరిగింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో తమ ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయనేది వ్యాపారవేత్తలు చెప్పేమాట. ఉదాహరణకు తెలుగులో యూనివర్సల్ మొబైల్స్‌కు హీరో మహేశ్‌బాబు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోండగా, అదే తమిళనాడుకు వచ్చేసరికి అదే బ్రాండ్‌కు మాధవన్ అంబాసిడర్‌గా ఉన్నారు. అలాగే మణప్పురం గోల్డ్‌లోన్‌కు తెలుగులో వె ంకటేష్, మలయాళంలో మమ్ముట్టి అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక కొన్ని సంస్థలైతే బ్రాండ్ అంబాసిడర్ల ఎంపికలోనూ వినూత్నత కనబరుస్తున్నాయి. ఉదాహరణకు ప్రముఖ షాపింగ్‌మాల్స్‌లో ఒకటైన బిగ్‌బజార్ సంపూర్ణ మహిళ పోటీలు నిర్వహిస్తోంది. దీని ద్వారా విభిన్న అంశాలకు సంబంధించి జరిపే పోటీల్లో గెలుపొందిన వారిని బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటిస్తోంది. గతేడాది నిర్వహిం చిన ఈ పోటీల్లో 10 వేల మంది మహిళలు పాల్గొన్నారు.
 
ఈ-కామర్స్‌కూ అంబాసిడర్లు...
బ్రాండ్ అంబాసిడర్ల వ్యవహారం ఇపుడు ఈ-కామర్స్ సంస్థలకూ పాకింది. చాలా ఈ-కామర్స్ సంస్థలు బాలీవుడ్ నటులనే రాయబారులుగా చేసుకుంటున్నాయి. ఓఎల్‌ఎక్స్‌కు అల్లు అర్జున్, స్నాప్‌డీల్‌కు ఆమిర్‌ఖాన్, యెప్మి మహిళ ఫ్యాషన్ విభాగానికి ఇషా గుప్తా, పురుషుల విభాగానికి ఫర్హాన్ అఖ్తర్, యాత్రా.కామ్‌కు సల్మాన్‌ఖాన్, బేబీ ఓయ్.కామ్‌కు కరిష్మా, టికెట్‌ప్లీజ్.కామ్‌కు అజయ్ దేవగన్, ఐఎంబేషరమ్.కామ్‌కు సన్నీలియోన్, గ్రూప్‌హోమ్‌బయర్స్.కామ్‌కు శిల్పాశెట్టి, జస్ట్ డయల్‌కు అమితాబ్, మింత్రకు హృతిక్ రోషన్, కంగనా రౌనత్‌లు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారంటే వీరి మార్కెట్ ఏ స్థాయిలో ఉందో చెప్పకనే తెలుస్తుంది.
 
ప్రచారకర్తలకూ మార్గదర్శకాలు..
మ్యాగీ నూడుల్స్ ప్రచారకర్తలుగా వ్యవ హరించిన బాలీవుడ్ తారలు అమితాబచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతిజింటాలపై కేసులను నమోదు చేయాలని బీహార్‌లోని ముజఫర్‌వూర్ చీఫ్ జస్టిస్ కోర్డు ఆదేశించిన నేపథ్యంలో ఇదెంతవరకూ సమంజసమనే ప్రశ్నలు తలెత్తాయి. ‘కంపెనీ లాభాలు తీసుకునే యజమానులను ప్రశ్నించవచ్చు కానీ రాయబారుల్ని ప్రశ్నించటం ఎంతవరకూ కరెక్టు?’ అనేది కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రశ్న. అందుకే బ్రాండ్ అంబాసిడర్ల నియామకం, వారి పరిధి, బాధ్యత వంటి అంశాలను వివరిస్తూ విధానాలను, మార్గదర్శకాలను సూచించాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌ను వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement