11,500 పాయింట్ల దిగువకు నిఫ్టీ

Impeachment inquiry into Donald Trump affect stock markets - Sakshi

504 పాయింట్ల నష్టంతో 38,594 వద్ద సెన్సెక్స్‌ ముగింపు

148 పాయింట్ల పతనంతో 11,440 వద్ద ముగిసిన నిఫ్టీ

నిఫ్టీ మిడ్, స్మాల్‌ క్యాప్‌లు 2% డౌన్‌

రెండు రోజుల రికార్డ్‌ లాభాల నేపథ్యంలో మంగళవారం ఆరంభమైన లాభాల స్వీకరణ బుధవారం కూడా కొనసాగింది. వృద్ధిని మరింతగా కుంటుపరిచేలా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులు చోటు చేసుకోవడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌పై అభిశంసన విచారణ  మొదలు కావడంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. వీటికి తోడు మన వృద్ధి అంచనాలను ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఏడీబీ) కోత కోయడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం కూడా తోడవడంతో  బుధవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమైంది.

  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 39,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,500 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ముడి చమురు ధరలు 1.6 శాతం పతనమైనా, మన మార్కెట్‌ పతనబాటలోనే కొనసాగింది. సెన్సెక్స్‌ 504 పాయింట్లు నష్టపోయి 38,594 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 148 పాయింట్లు పతనమై 11,440 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నిప్టీ మిడ్, స్మాల్‌క్యాప్‌ సూచీలు చెరో 2%  పతనమయ్యాయి.  

ఒడిదుడుకులు కొనసాగుతాయ్‌...
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ అభిశంసన ప్రతిపాదన కారణంగా అమెరికాలో రాజకీయ దుమారం చెలరేగడంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎనలిస్ట్‌ వినోద్‌ నాయర్‌ వ్యాఖ్యానించారు. దీని ప్రభావం స్వల్పకాలికంగానే ఉండనున్నదని ఆయన భావిస్తున్నారు. మొండి బకాయిలకు సంబంధించి తాజా సమస్యలు, సెప్టెంబర్‌ వాహన అమ్మకాలు బలహీనంగా ఉండే అవకాశాలు, ఈ నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు మరో రోజులో ముగియనుండటం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని వివరించారు. సెప్టెంబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు నేడు(గురువారం) ముగియనుండటంతో ఒడిదుడుకులు కొనసాగుతాయని నిపుణులంటున్నారు. వచ్చే నెల 4న ఆర్‌బీఐ పాలసీ,  క్యూ2 ఫలితాలను బట్టి మార్కెట్‌ గమనం ఆధారపడి ఉంటుందని వారంటున్నారు.

రూ.1.84 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాల కారణంగా రూ.1.84 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.1,84,484 కోట్లు తగ్గి రూ.1,46,88,764 కోట్లకు పడిపోయింది.

పతనానికి ప్రధాన కారణాలు 

లాభాల  స్వీకరణ  
డొనాల్ట్‌ ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియ
ట్రంప్‌ చైనా వ్యతిరేక వ్యాఖ్యలు
పతనమైన ప్రపంచ మార్కెట్లు
వృద్ధి అంచనాలను తగ్గించిన ఏడీబీ  

రూపాయి పతనం
మార్కెట్‌ భారీగా నష్టపోయినా, ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ షేర్‌ మెరుపులు మెరిపించింది. దేశంలోనే అతి పెద్ద బీ2బీ కంపెనీ అయిన ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ షేర్‌ ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హై, రూ.1,970ను తాకింది. చివరకు స్వల్ప లాభంతో రూ.  1,874 వద్ద ముగిసింది. ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన ఈ కంపెనీ ఇష్యూ ధర, రూ.973తో పోల్చితే దాదాపు రెట్టింపైంది. గత నెల కాలంలోనే ఈ కంపెనీ షేర్‌ 70 శాతానికి పైగా పెరగడం విశేషం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top