ప్రమోటర్ల పుష్‌- IIFL షేర్లు హైజంప్‌

IIFL Group shares jumps on promoter stake hike - Sakshi

గ్రూప్‌ షేర్ల లాభాల దూకుడు

ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ 20%

ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ 13%

ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ 10 శాతం

గ్రూప్‌ కంపెనీలో ప్రమోటర్లు వాటా కొనుగోలు చేసిన వార్తలతో ఐఐఎఫ్‌ఎల్‌(IIFL) కౌంటర్లకు భారీ డిమాండ్‌ నెలకొంది. ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు క్యూకట్టడంతో గ్రూప్‌లోని మూడు లిస్టెడ్‌ కంపెనీల షేర్లూ అనూహ్య లాభాలతో పరుగు తీస్తున్నాయి. ట్రేడింగ్‌ పరిమాణం సైతం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా కంపెనీ ప్రమోటర్‌, డైరెక్టర్‌ నిర్మల్‌ జైన్‌ ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌లో 4.54 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఇందుకు రూ. 3.4 కోట్లు వెచ్చించారు. దీంతో కంపెనీలో జైన్‌ వాటా 12.49 శాతం నుంచి 12.61 శాతానికి బలపడింది. ఈ నేపథ్యంలో ఐఐఎఫ్‌ఎల్‌ గ్రూప్‌ షేర్లన్నీ హైజంప్‌ చేశాయి. 

యమ స్పీడ్‌
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 46 సమీపంలో ఫ్రీజయ్యింది. ఈ బాటలో ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ షేరు 13 శాతం దూసుకెళ్లింది. రూ. 1134 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1195 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఇక ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌ సైతం అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికమై 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 82.50 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం 2.46 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ కౌంటర్లో 4.85 లక్షల షేర్లు చేతులు మారాయి. ఇదే విధంగా 99,000 షేర్ల సగటుతో పోలిస్తే ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ కౌంటర్లో 65,000 షేర్లు, 2700 షేర్ల సగటుతో పోలిస్తే ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ కౌంటర్లో 1400 షేర్లు చొప్పున ట్రేడయ్యాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top