ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా ఐటీ కంపెనీ టెక్ మహీంద్రాతో...
ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా ఐటీ కంపెనీ టెక్ మహీంద్రాతో కలసి ‘ట్యాప్ ఎన్ పే’ పేరిట చెల్లింపుల సేవలను ప్రారంభించింది. ఇందులో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్ (ఎన్‌ఎఫ్‌సీ) టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఈ విధానంలో ఎన్‌ఎఫ్‌సీ టెక్నాలజీ గల మొబైల్ ఫోన్ లేదా ట్యాగ్‌ను ఆయా వర్తకుల కౌంటర్లోని ప్రత్యేక మెషీన్‌కు తాకించడం ద్వారా ఆన్‌లైన్ మాధ్యమంలో షాపు ఖాతాలోకి నగదు బదిలీ అవుతుంది.
ఇందుకోసం వర్తకులు ముందుగా రిజిస్టరు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమ కస్టమర్లను జోడించుకోవాలి. ప్రస్తుతం ఆఫీస్ క్యాంటీన్లు వంటి కొన్ని చోట్లకు మాత్రమే ఇది పరిమితమని, దీన్ని డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డులాగా అన్ని చోట్లా ఉపయోగించుకోవడానికి వీలు ఉండదని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. కేవలం తమ బ్యాంకు ఖాతాదారులే కాకుండా ఇతరత్రా ఏ బ్యాంకులో అకౌంటు ఉన్నవారైనా ఈ విధానాన్ని ఉపయోగించుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది.