మీడియా కింగ్‌కు ఐటీ సెగ

I-T dept raids Quint founder Raghav Bahl house over alleged tax evasion - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ:  మీడియా దిగ్గజానికి ఆదాయ పన్ను శాఖ భారీ షాక్‌ ఇచ్చింది. ది క్వింట్‌ న్యూస్‌పోర్టల్‌, న్యూస్‌ 18 గ్రూపు  వ్యవస్థాపకుడు రాఘవ్‌ బాల్‌ ఇంటిపై ఐటీ అధికారులు ముమ్మర దాడులు నిర్వహించారు.  దీంతోపాటు క్వింట్‌ కార్యాలయంపై కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. పన్ను ఎగవేతపై ఆరోపణలతో  నోయిడాలోని బాల్‌ నివాసం, ఆఫీసుపై  గురువారం  ఐటీ అధికారులు దాడులు  చేశారు.  పన్ను ఎగవేత కేసు విచారణంలో ఆయన నివాసంలో వివిధ  డాక్యుమెంట్లను ఇతర పత్రాలను పరిశీలిస్తున్నామనీ, ఇతర ప్రాంతాల్లో  కూడా సోదాలు కొనసాగుతున్నాయని ఐటీ శాఖ  వెల్లడించింది.

మరోవైపు  ఐటీ దాడులపై రాఘవ్‌ బాల్‌ స్పందించారు. తాను ఈ ఉదయం ముంబైలో ఉండగా, డజన్ల కొద్దీ ఐటీ అధికారులు తన నివాసం  క్విన్ట్ కార్యాలయంపై దాడికి దిగారని ఆందోళన వ్యక్తంచేశారు.  అదే సందర్భంలో కొన్నిముఖ్యమైన డాక్యుమెంట్లను ,ఇతర పాత్రికేయ సమాచారాన్ని  దుర్వినియోగం చేయొద్దని ఐటీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. స్మార్ట్‌ఫోన్ల ద్వారా తమ సమాచారాన్ని  సేకరించవద్దని, అలా చేస్తే  ప్రతిచర్య తప్పదన్నారు. ఈ విషయంలో ఎడిటర్స్‌ గిల్డ్‌ తమకు అండగా  ఉంటుందని ఆశిస్తున్నానన్నారు.  తద్వారా భవిష్యత్‌లో ఇతర పాత్రికేయ సంస్థపై జరగబోయే ఈ తరహా దాడులను  నివారించాలని బాల్‌ కోరారు.

క్వింట్‌ పెట్టుబడులు పెట్టిన ది న్యూస్ మినిట్  బెంగళూరు కార్యాలయంలో కూడా ఐటీ బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. అయితే ఐటీ చట్టం సెక్షన్ 133ఏ క్రింద  ఇది సర్వేమాత్రమే నని, తనిఖీలు లేదా దాడి కాదని  తెలిపారు. ఆర్థిక పత్రాలు, ఆడిట్ పుస్తకాలు వారికి చూపించాలని అక్కడి సిబ్బందిని కోరారు. ఐటీ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని  ది న్యూస్ మినిట్  ఎడిటర్‌ ఇన్‌ ఛీఫ్‌ ధన్య రాజేంద్రన్ చెప్పారు.

మండిపడ్డ ప్రశాంత్‌ భూషణ్
రాఘవ్‌ బాల్‌ నివాసం, కార్యాలయాల్లో ఐటీ దాడులను ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తప్పుబట్టారు. కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న మీడియాను భయపెట్టడానికే ఈ దాడులని విమర్శించారు. ఇంతకుమందెన్నడూ లేని విధంగా  ఐటీ, ఈడీ, సీబీఐ లను  ప్రభుత్వ అక్రమంగా వాడుకుంటోందని మండిపడ్డారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top