ఐ ఫోన్ 6ను కట్నంగా అడిగాడు... | Sakshi
Sakshi News home page

ఐ ఫోన్ 6ను కట్నంగా అడిగాడు...

Published Mon, Sep 22 2014 9:34 AM

ఐ ఫోన్ 6ను కట్నంగా అడిగాడు... - Sakshi

ఇప్పటివరకూ పెళ్లిళ్లలో కట్నాల కింద క్యాష్, కార్లు, బంగారం, బైక్లు, భవనాలు అడగటమే చూశాం. తాజాగా ఆ లిస్ట్లో యాపిల్ ఐ ఫోన్ 6 కూడా చేరింది.  అయితే ఇక్కడ మాత్రం ఇది వరకట్నం కాదు.. కన్యాశుల్కం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఐఫోన్లంటే  మంచి క్రేజ్ నెలకొంది.  ఐఫోన్ ధర కూడా భారీ మొత్తంలో ఉన్న విషయం తెలిసిందే. ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలంటారు.

సౌదీలో ఓ అమాయకుడు ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. తీరా చూస్తే ఆమెకు ఓ అన్న ఉన్నాడు. తన చెల్లెలికి ప్రపోజ్ చేయాలంటే.. ముందుగా తనకు ఓ ఐఫోన్ 6 కన్యాశుల్కంగా ఇచ్చుకోవాలని షరతు పెట్టాడు. ఫోన్ ఇచ్చేవరకు పెళ్లి చేసే ప్రసక్తి మాత్రం లేనే లేదని కచ్చితంగా చెప్పేశాడు. తీరా చూస్తే ఐఫోన్ 6 ఇంతవరకు సౌదీలోకి అడుగుపెట్టనే లేదు. ఆఫోన్ రావాలి, కొనివ్వాలి.. ఆ తర్వాతే పెళ్లి అని చెప్పాడు. దాంతో.. 'ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు' అని తనమీద తానే జాలిపడుతూ ఐఫోన్ ఎప్పుడు వస్తుందాని అతగాడు ఎదురు చూస్తూ ఉన్నాడు.

కొంగొత్త ఫీచర్లతో టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా ఆవిష్కరించిన ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్లు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫోన్లు ఈనెల 19న మార్కెట్లోకి విడుదలయ్యాయి. అయితే అమెరికా ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, సింగపూర్, యూకే, ఆస్ట్రేలియా, జపాన్లో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇతర దేశాల్లో వీటి రాక కాస్త ఆలస్యం కానున్నాయి. దాంతో  సౌదీ పెళ్లికొడుకు వివాహం కూడా అప్పటి వరకూ వాయిదా పడనుంది. సౌదీలో ఈ  ఫోన్  అందుబాటులో వచ్చేవరకూ కాబోయే దంపతులు నిఖా కోసం అప్పటివరకూ వేచి చూడాల్సిందే.

అరబ్ దేశాల్లో కట్నాలు ఇవ్వటం సాంప్రదాయకమే. వారు తమ తాహత్తుకు తగ్గట్టు బహుమతులు ఇచ్చుకోవటం సాధారం. అయితే కొన్ని కుటుంబాలు మాత్రం తమకు కావాల్సిన ఖరీదైన వస్తువులను డిమాండ్ చేసి మరీ వసూలు చేస్తుంటారు. అయితే  కట్నాల జాబితాలో ఐఫోన్ 6 కావాలని కోరటం ఇదే తొలిసారట. ఇక  అడ్వాన్స్డ్ ఫీచర్లతో రూపొందిచిన ఈ ఫోన్ పట్ల చిన్నా పెద్దా, యువత ఆసక్తి కనబరుస్తోంది. అక్టోబర్ 17న భారత మార్కెట్లోకి అధికారికంగా ఈ ఫోన్ రాబోతోంది. ఆన్ లైన్లో, బ్లాక్ మార్కెట్లో ఈ ఫోన్ ధర లక్ష రూపాయల వరకు పలుకుతున్నట్లు సమాచారం.
 

Advertisement
Advertisement