ఏయూఎమ్‌ ఎంత ఉంటే మంచిది?

How good is the AUM? - Sakshi

నేను ఒక మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి అనుకుంటున్నాను. ఇలా ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసే ముందు ఆ ఫండ్‌ ఏయూఎమ్‌(అసెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌–నిర్వహణ ఆస్తుల)ను పరిగణనలోకి తీసుకోవాలా ? ఏయూఎమ్‌ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదా ? అసలు ఏయూఎమ్‌ ఎంత ఉంటే ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు ? – రాధిక, విజయవాడ  
ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నప్పుడు ఆ ఫండ్‌ ఏయూఎమ్‌(అసెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌–నిర్వహణ ఆస్తులు) ఎంత ఉందో తెలుసుకోవడం మంచిదే. అయితే మనం ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నది ఏ రకం ఫండ్‌ అనే దానిని బట్టే ఏయూఎమ్‌ను పరిగణించే విషయం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మనం లిక్విడ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకున్నామనుకోండి. అత్యధిక ఏయూఎమ్‌ ఉన్న ఫండ్‌ ఉత్తమమైన ఫండ్‌ అని చెప్పవచ్చు.

అంటే మిగిలిన లిక్విడ్‌ ఫండ్స్‌ కన్నా అధికంగా  నిర్వహణ ఆస్తులు (ఏయూఎమ్‌) ఉన్న ఫండ్‌నే ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఎంచుకోవాలి. వడ్డీరేట్లు, లేదా రుణాలు, తదితర అంశాలకు సంబంధించి ప్రతికూల పరిస్థితులు తలెత్తినప్పుడు అధిక ఏయూఎమ్‌ ఉన్న ఫండ్‌ తట్టుకోగలుగుతుంది. ఇక  స్మాల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ విషయానికొస్తే, అధిక ఏయూఎమ్‌ అనేది ఒక్కోసారి వరమవుతుంది. మరోసారి అదే గుదిబండ అవుతుంది. ఈ ఫండ్‌ పనితీరు బాగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడతాయి.

ఇలా భారీగా నిధులు వచ్చినప్పుడు నిర్వహణ కష్టమవుతుంది. లిక్విడిటీ సమస్యలు ఉండే అవకాశాలూ లేకపోలేదు. ఇక లార్జ్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ విషయానికొస్తే, ఏయూఎమ్‌ను అసలు పరిగణించాల్సిన అవసరమే లేదు. లార్జ్‌క్యాప్‌ ఫండ్‌కు భారీగా  నిధులుంటాయి. ఈ లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ను నిర్వహించే ఫండ్‌ మేనేజర్లు ప్రాధాన్యతల కారణంగా లిక్విడిటీ సమస్యలు తలెత్తే అవకాశాలూ తక్కువగా ఉంటాయి. సాధారణంగా చెప్పాలంటే మీరు ఏదైనా లార్జ్‌క్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారనుకోండి. కనీసం రూ.35,000–40,000 కోట్ల రేంజ్‌లో ఏయూఎమ్‌ ఉన్న ఫండ్స్‌ను ఎంచుకోండి. మల్టీక్యాప్‌ ఫండ్స్‌కు అయితే ఏయూఎమ్‌ రూ.20,000 కోట్లకు తగ్గకుండా ఉండాలి. ఇక స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌కైతే ఏయూఎమ్‌ రూ.3,000–5,000 కోట్లపైన ఉంటేనే మంచిది.  

మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి చార్జీలు ఎలా ఉంటాయి ? మనకు కనిపించని, అర్థం కాని చార్జీల భారం మనపై ఏమైనా ఉంటుందా? – హుస్సేన్, హైదరాబాద్‌
చార్జీల విషయంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పారదర్శకంగానే ఉంటాయని చెప్పవచ్చు. మనకు కనిపించని, అర్థం కాని చార్జీల భారం దాదాపు ఉండదు. మనం మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ఒకే ఒక చార్జీ.. ఎక్స్‌పెన్స్‌ రేషియో ఉంటుంది. ఈ ఒక్క చార్జీలోనే అన్ని చార్జీలు కలసిఉంటాయి. మేనేజ్‌మెంట్‌ ఫీజు, అమ్మకాల వ్యయాలు, నిర్వహణ వ్యయాలు, రిజిష్ట్రార్‌ ఫీజు, కస్టోడియన్‌ ఫీజు, ఇతర వ్యయాలు.. ఇవన్నీ కలసి ఈ ఎక్స్‌పెన్స్‌ రేషియోలోనే ఉంటాయి.

అయితే ఈ ఎక్స్‌పెన్స్‌ రేషియో ఫండ్‌ను బట్టి, స్కీమ్‌ను బట్టి మారుతూ ఉంటుంది. ఒకే ఫండ్‌ రెగ్యులర్‌ ప్లాన్‌కు ఒక రకంగానూ, డైరెక్ట్‌ ప్లాన్‌కు మరో రకంగానూ ఎక్స్‌పెన్స్‌ రేషియో ఉంటుంది. సాధారణంగా ఒక ఈక్విటీ ఫండ్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో 2.5–2.65% ఉంటుంది. డైరెక్ట్‌ ప్లాన్‌లకు అయితే 50–75 బేసిస్‌ పాయింట్లు తక్కువగా ఉంటుంది. డెట్‌ ఫండ్స్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో ఇంకా తక్కువగా ఉంటుంది.  

మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను విక్రయించినప్పుడు ఎగ్జిట్‌ లోడ్‌ ఉంటుంది. ఇది కూడా ఫండ్‌ను బట్టి,  ఎంత కాలం ఇన్వెస్ట్‌ చేశారు అనే విషయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కొనుగోలు చేసిన ఏడాదిలోపే ఈక్విటీ ఫండ్‌ యూనిట్లను విక్రయిస్తే, సదరు సంస్థ ఎగ్జిట్‌ లోడ్‌ వసూలు చేస్తుంది. ఏడాది తర్వాత విక్రయిస్తే, ఎలాంటి ఎగ్జిట్‌ లోడ్‌ ఉండదు. డెట్‌ ఫండ్స్‌కైతే ఈ ‘ఇన్వెస్ట్‌మెంట్‌ పీరియడ్‌’ వేరే విధంగా ఉంటుంది. ఇక లిక్విడ్‌ ఫండ్స్‌ ఎలాంటి ఎగ్జిట్‌లోడ్‌ను వసూలు చేయవు. ఇక ఫండ్స్‌కు సంబంధించిన మరో ముఖ్యమైన చార్జీ.. సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌(ఎస్‌టీటీ). ఈక్విటీ, బ్యాలన్స్‌డ్,, ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌ విక్రయాలపై ఈ ఎస్‌టీటీని చెల్లించాల్సి ఉంటుంది.  

నా ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌లో ఎన్‌పీఎస్‌(నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌)కు తప్పనిసరిగా చోటివ్వాలా ? ఈక్విటీలు, ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసినా కూడా ఎన్‌పీఎస్‌లో కూడా ఇన్వెస్ట్‌ చేయాల్సిందేనని కొందరు మిత్రులంటున్నారు. తగిన సలహా ఇవ్వండి.      – కృష్ణన్, చెన్నై  
మీరు బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ లేదా టర్మ్‌ బీమా పాలసీ లేదా ఆరోగ్య పాలసీలో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లయితే ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసిన సొమ్ము మీరు రిటైరయ్యేదాకా లాక్‌ అయి ఉంటాయి. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసిన పెట్టుబడులను మీరు రిటైరయ్యేదాకా తీసుకునే వెసులుబాటు దాదాపు లేదు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఒక క్రమశిక్షణను అలవాటు చేస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ లేని చాలా మందికి ఇది నిజంగా మంచి పథకం.

కానీ ఆర్థిక క్రమశిక్షణ ఉండి, పొదుపు, మదుపుల గురించి సరైన అవగాహన ఉండి, వాటి ప్రాముఖ్యత తెలిసిన వారికి, చిల్లర, మల్లర ఖర్చుల కోసం చీటికీ, మాటికీ మదుపు చేసిన డబ్బులను వాడని వాళ్లకి, ఎన్‌పీఎస్‌ అవసరం లేదు. ఒకవేళ మీరు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే ఈ ప్లాన్‌ విషయమై దూకుడు స్వభావమున్న ఆప్షన్లను ఎంచుకోవాలి. ఎందుకంటే ఎన్‌పీఎస్‌లో అత్యంత దూకుడు స్వభావమున్న ప్లాన్‌ కూడా ఉదార స్వభావం గలదేనని చెప్పవచ్చు. వీలైనంత ఎక్కువగా ఈక్విటీకి కేటాయింపులు జరపండి. మీరు రిటైరయ్యే ఐదేళ్లముందు వరకూ ఈ ఈక్విటీ కేటాయింపులు కొనసాగించండి. మీరు మరో ఐదేళ్లలో రిటైరవుతారు అన్న సమయానికి వీటిల్లో గరిష్ట ఇన్వెస్ట్‌మెంట్స్‌ను స్థిరాదాయ సాధనాలున్న ఆప్షన్లోకి మార్చుకోండి.  

- ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top