హోండాకు మరో షాక్ : ఉత్పత్తి నిలిపివేత

 Honda Cyber Attack Halts Plants in India and Brazil - Sakshi

 సైబర్ ఎటాక్ : వివిధ దేశాల్లో ప్లాంట్ల మూత

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనావైరస్, లాక్‌డౌన్  కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాన్ని ఎదుర్కొన్న జపాన్ కార్ల తయారీ సంస్థ హోండాకు తాజాగా సైబర్ ఎటాక్ షాక్ తగిలింది.  ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక కర్మాగారాలను ప్రభావితం చేసింది.  దీంతో ఈ  దాడి నుంచి కోలుకునేందుకు ఇండియా,  బ్రెజిల్  హోండా ప్లాంట్లలో కార్యకలాపాలను నిలిపివేసింది.

అంతర్గత సర్వర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ ఎటాక్ జరిగిందని, కంపెనీ సిస్టంల ద్వారా వైరస్ వ్యాపించిందని కంపెనీ ప్రతినిధి బుధవారం వెల్లడించారు. దీంతో భారతదేశం, బ్రెజిల్‌లోని మోటార్‌సైకిల్ ప్లాంట్లను మూసి వేశామన్నారు. అయితే టర్కీలోని  కార్ల తయారీ ప్లాంట్ వద్ద బుధవారం తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలను పరిశీలిస్తున్నామని ఆమె చెప్పారు. అయితే దీని ప్రభావం  ప్రపంచవ్యాప్తంగా హోండా వ్యాపారంపై పరిమితంగానే ఉంటుందన్నారు. (ఎట్టకేలకు ఆనంద్ మహీంద్రా సాధించారు)

సైబర్ దాడి కారణంగా యుఎస్ లో ఐదు సహా, మొత్తం11 హోండా ప్లాంట్లను ప్రభావితం చేసినట్టు సమాచారం. అయితే యుఎస్ ప్లాంట్లు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాయి. కాగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా హోండాతో సహా గ్లోబల్ వాహన తయారీదారులు ఇప్పటికే సంక్షోభంలో పడ్డాయి. గత నెలలో హోండా నికర లాభంలో 25.3 శాతం క్షీణతను నమోదు చేసింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు ఆరు శాతం  తగ్గాయి. (పీఎన్‌బీ : మూడు ఆడి కార్లు, విమర్శలు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top