కొత్త బెయిలవుట్ కోసం గ్రీస్ విజ్ఞప్తి.. | Greece appealed for a new bailout .. | Sakshi
Sakshi News home page

కొత్త బెయిలవుట్ కోసం గ్రీస్ విజ్ఞప్తి..

Jul 9 2015 2:37 AM | Updated on Sep 3 2017 5:08 AM

కొత్త బెయిలవుట్ కోసం గ్రీస్ విజ్ఞప్తి..

కొత్త బెయిలవుట్ కోసం గ్రీస్ విజ్ఞప్తి..

ఆర్థికంగా కుప్పకూలడానికి సిద్ధంగాఉన్న గ్రీస్.. ఈ సంకటం నుంచి తప్పించుకోవడం కోసం కొత్త బెయిలవుట్ కోసం

యూరోపియన్ పార్లమెంటులో ప్రధాని సిప్రస్ ప్రసంగం
♦ సంస్కరణలను అమలు చేస్తామని హామీ...
♦ నేడు సవివర ప్రణాళిక సమర్పించాలి...
♦ యూరోజోన్ దేశాల తాజా డెడ్‌లైన్...
♦ ఆదివారం ఈయూ సదస్సులో నిర్ణయం...
 
  స్ట్రాస్‌బర్గ్(ఫ్రాన్స్) : ఆర్థికంగా కుప్పకూలడానికి సిద్ధంగాఉన్న గ్రీస్.. ఈ సంకటం నుంచి తప్పించుకోవడం కోసం కొత్త బెయిలవుట్ కోసం అధికారికంగా యూరప్ నేతలు, రుణదాతలకు బుధవారం విజ్ఞప్తి చేసింది. యూరప్ బెయిలవుట్ ఫండ్ నుంచి తాజాగా మూడేళ్లపాటు ప్యాకేజీ ఇవ్వాల్సిందిగా రాతపూర్వకంగా కోరింది. ఈ విషయాన్ని యూరోజోన్ అధికార ప్రతినిధి మైఖేల్ రీన్స్ వెల్లడించారు. మరోపక్క, గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రస్ యూరోపియన్ పార్లమెంటులో ప్రసంగిస్తూ... సంస్కరణల అమలుకు తాము సిద్ధమేనని ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి తెరదించేందుకు తమ దేశం రుణదాతలతో కొత్త ఒప్పందం కోసం ఎదురుచూస్తోందన్నారు.

కొత్తగా సహాయ ప్యాకేజీ అందించేందుకు వీలుగా సవివరమైన, విశ్వసనీయ ప్రణాళికతో పాటు చేపట్టబోయే వ్యయ నియంత్రణ, ఇతరత్రా ఆర్థికపరమైన చర్యలను నేటికల్లా సమర్పించాల్సిందేనని యూరప్ నేతలు డెడ్‌లైన్ విధించారు. ఈ ప్రణాళికపై చర్చించేందుకు ఆదివారం(11న) కేవలం యూరోజోన్ సభ్యులతోనే(19 దేశాలు) కాకుండా మొత్తం యూరోపియన్ యూనియన్(28 దేశాల) నేతలతో సదస్సు నిర్వహించాలని ఈయూ ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్ నిర్ణయించారు.  మరోపక్క, సిప్రస్ తాజా ప్రతిపాదనలు ఎందుకూపనికిరావని, యూరోజోన్ నుంచి గ్రీస్ వైదొలిగేందుకే ఎక్కువగా అవకాశాలున్నాయని యూరోపియన్ కమిషన్(ఈసీ) ప్రెసిడెంట్ జీన్-క్లాడ్ జుంకర్ వ్యాఖ్యానించడం గమనార్హం.

 మా దేశాన్ని ప్రయోగశాలగా మార్చారు...
 గత ఐదేళ్లుగా కొనసాగిన బెయిలవుట్ ప్యాకేజీలతో తమ దేశాన్ని వ్యయ నియంత్రణ (ఆస్టెరిటీ)  చర్యలకు ఒక ప్రయోగశాలగా మార్చేశారని  సిప్రస్ పేర్కొన్నారు. దీనివల్ల దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోవడంతోపాటు ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రంగా దిగజారేందుకు దారితీసిందన్నారు.

 కొనసాగుతుతున్న నియంత్రణలు...
 గ్రీస్‌లో బ్యాంకుల మూత, ఏటీఎం విత్‌డ్రాయల్స్‌పై పరిమితి(రోజుకు 60 యూరోలు) కొనసాగుతోంది. దాదాపు ఆదివారం వరకూ బ్యాంకులు తెరిచే అవకాశాల్లేవనేది ప్రభుత్వ వర్గాల సమాచారం. విదేశాలకు డబ్బు పంపుకోవాలన్నా, బిల్లుల చెల్లింపులకు సైతం ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి వస్తుండటంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement