నగదు కొరత ఎందుకంటే..

Govt Probes Source Of Cash Crunch, Discovers Large Payments Without Any Economic Logic - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తీవ్ర నగదు కొరతకు కారణాలపై కేంద్రం ఆరా తీస్తోంది. కొన్ని ప్రాంతాల్లో నగదు విత్‌డ్రాయల్స్‌ అనూహ్యంగా, అసాధారణంగా పెరగడమే నగదు కొరతకు కారణమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గత కొన్నివారాలుగా దేశంలోని నిర్ధిష్ట ప్రాంతాల్లో భారీ మొత్తంలో చెక్కు ద్వారా, ఇతరత్రా నగదు ఉపసంహరణలు చోటుచేసుకున్నట్టు ఆదాయపన్ను శాఖ డేటా మైనింగ్‌ ద్వారా విశ్లేషించింది. తొలుత రూ కోట్ల విలువైన భారీ నగదు విత్‌డ్రాయల్స్‌ తెలంగాణలో తర్వాత ఉత్తర కర్ణాటకలో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా ఈ మూడు రాష్ట్రాల్లో నగదు కోసం డిమాండ్‌ ఊపందుకున్నట్టు గుర్తించారు. సాధారణ పౌరుల నగదు విత్‌డ్రాయల్స్‌ పెరిగనందునే నగదు కొరత ఏర్పడిందన్న వాదనను అధికారులు తోసిపుచ్చారు. నిర్ధిష్ట ప్రాంతాల్లో చెక్కులు ఇతర బ్యాంకింగ్‌ సాధనాల ద్వారా భారీ చెల్లింపులు చేపట్టడంతోనే నగదు కొరత ప్రారంభమైందని చెబుతున్నారు.

భారీ విత్‌డ్రాయల్స్‌ మూలాలను గుర్తించిన ఆదాయపన్ను శాఖ మూడు దక్షిణాది రాష్ట్రాల్లోని రైస్‌ మిల్లర్లు, కాంట్రాక్టర్లు, ఆగ్రో ట్రేడర్లు మార్చి ద్వితీయార్థంలో భారీ చెల్లింపులు చేపట్టారని గుర్తించింది. ఐటీ శాఖ నిర్వహించిన సర్వేలో ఓ వ్యాపారి కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే 20 భారీ మొత్తాలతో కూడిన చెల్లింపులు చేసినట్టు వెల్లడైంది. నగదు కొరతకు కారణమైన కొన్ని సంస్థలు, వ్యక్తులను ఇప్పటికే ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 131 కింద ఐటీ శాఖ కాంట్రాక్టర్లు, రైస్‌ మిల్లర్లు, ఇతరులను ప్రశ్నిస్తోంది.

వారి గత, ప్రస్తుత చెల్లింపులను పరిశీలిస్తే తాజా చెల్లింపులకు గత వ్యయాలతో పోలిస్తే ఎలాంటి సంబంధం లేవని గుర్తించింది. గతంలో ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరగని సంస్థలకు సైతం పలు చెల్లింపులు జరిగినట్టు వెల్లడైంది. అయితే ఈ లావాదేవీలు ఎందుకు జరిగాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మార్చి-ఏప్రిల్‌లోని 13 రోజుల్లో రూ 45,000 కోట్ల విలువైన నగదు విత్‌డ్రాయల్స్‌ జరిగాయని తేలింది. సాధారణంగా ఇవి అటూఇటూగా రూ 20,000 కోట్లు ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అసాధారణ చెల్లింపులకు కారణమేంటనే కోణంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆదాయపన్ను శాఖ వర్గాలు ఆరా తీస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top