విదేశాలకు ఎగిరి పోకుండా ఆంక్షలు

Government May Clip Wings Of Wilful Defaulters Soon - Sakshi

న్యూఢిల్లీ : బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోతున్న వారికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రూ.50 కోట్లు, ఆపై రుణాలు తీసుకుని, విదేశాలకు వెళ్తున్న ఉద్దేశ్యపూర్వక రుణ ఎగవేతదారులకు చెక్‌ పెట్టేలా చర్యలు తీసుకోంది. ఇక మీదట ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకుండా ఉండేలా  కఠిన వైఖరి  అనుసరించాలని కేంద్రం భావిస్తోంది. దీని కోసం పైనాన్సియల్‌ సర్వీసెస్‌ సెక్రటరీ రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలో  ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ పలు సూచనలను కేంద్రం ముందు ఉంచింది. వాటిలో ఒకటి దేశీయ పాస్‌పోర్టు చట్టం సెక్షన్‌ 10లో సవరణ. ఈ చట్టం పాస్‌పోర్ట్‌ల రద్దుకు సంబంధించింది.

అంతేకాక రూ.50 కోట్లు, ఆపై రుణాలు తీసుకునే వారి పాస్‌పోర్టు వివరాలను కూడా తప్పనిసరిగా బ్యాంక్‌లు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ వీరు ఉద్దేశ్యపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోవాలనుకుంటే, ఎయిర్‌పోర్టుల వద్దనే వారికి చెక్‌ పెట్టనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్‌బీఐ ప్రతినిధులు, హోం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధులు, ఈడీ, సీబీఐ ప్రతినిధులు ఉన్నారు. పీఎన్‌బీలో రూ.14వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్‌ మోదీతో పాటు, విజయ్‌మాల్యా, మరికొంత మంది ప్రమోటర్లు బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి, విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే.

వారిపై చర్యలు తీసుకునేందుకు, వారు అసలు భారత్‌కు రావడం లేదు. దీంతో ముందస్తు జాగ్రత్తలుగా రూ.50 కోట్ల కంటే ఎక్కువ రుణాలు కలిగి ఉన్న ఎన్‌పీఏ అకౌంట్లు ఏమేమీ ఉన్నాయో విచారణ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను ఆదేశించింది. కాగా గత కొన్ని రోజుల క్రితమే రూ.100 కోట్ల కన్నా ఎక్కువ విలువైన ఆర్థిక నేరాలకు పాల్పడేవారి ఆస్తులను, వారి బినామీ ఆస్తులను జప్తు చేయడానికి కేంద్రం ఆర్థిక నేరగాళ్ల బిల్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top