అప్పట్లో నేలపై పడుకునేవాడ్ని : సుందర్‌ పిచాయ్‌

Google CEO Sundar Pichai Reveals As A Kid He Lived In Small House - Sakshi

న్యూయార్క్‌ : ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ బాల్యంలో తనకెదురైన అనుభవాలను పంచుకున్నారు. చెన్నైలో తన చిన్ననాట గడిపిన రోజులను న్యూయార్క్‌ టైమ్స్‌ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తాము నిరాడంబర జీవితం గడిపేవారమని, సాదాసీదా ఇంటిలో కొంత భాగం అద్దెకు ఇచ్చి మరో భాగంలో తాము సరిపెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. లివింగ్‌ రూమ్‌లో నేలపైనే తాము నిద్రించేవారమని, తాను పెద్దయ్యే క్రమంలో తీవ్ర కరువు వెంటాడిందని వెల్లడించారు.

అప్పట్లో తమకు ఫ్రిజ్‌ లేదని, ఎన్నో రోజుల తర్వాత తాము ఫ్రిజ్‌ను కొనడంతో సంబరపడిపోయామని చెప్పారు. తాను బాల్యంలో విపరీతంగా పుస్తకాలు చదివేవాడినని, స్నేహితులతో సరదాగా వీధుల్లో క్రికెట్‌ ఆడేవాడినని అప్పటి రోజుల్లో తాము ఎలాంటి చీకూచింతా లేకుండా జీవితాన్ని ఆస్వాదిం‍చామని అన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా అవేమీ తమకు అవరోధాలుగా కన్పించలేదని చెప్పుకొచ్చారు. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ చేసే ముందు పిచాయ్‌ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివారు. అప్పట్లో ల్యాబ్స్‌, కంప్యూటర్స్‌ అందుబాటులో ఉండేవి కావని, కానీ ఇంటర్‌నెట్‌ ద్వారా భారీ మార్పులు చోటుచేసుకుంటాయని తనకు అంతగా అవగతం కాలేదని అన్నారు.

పిచాయ్‌ పెన్సిల్వేనియా వార్టన్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ డిగ్రీ పొందారు. 2004లో గూగుల్‌లో క్రోమ్‌ బ్రౌజర్‌ను అభివృద్ధి చేసే బృందంలో ఒకరిగా పిచాయ్‌ చేరిన పిచాయ్‌ పదేళ్ల తర్వాత కంపెనీ ఉత్పత్తులు, సెర్చ్‌, యాడ్స్‌, అండ్రాయిడ్‌లతో కూడిన ప్రోడక్ట్స్‌, ప్లాట్‌ఫామ్స్‌కు ఇన్‌చార్జ్‌గా ఎదిగారు. 2015లో సీఈవోగా అత్యున్నత పదవిని చేపట్టిన సుందర్‌ పిచాయ్‌ గత ఏడాది గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ బోర్డులో స్ధానం పొందారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top