గృహ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌!

Good News fFr Home Buyers! - Sakshi

పట్టణాల్లో కొత్త ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అఫార్డబుల్‌ హౌజింగ్‌ స్కీమ్‌ ప్రధాన్‌ మంత్రి అవాస్‌ యోజన-అర్బన్‌(పీఎంఏఐ-యూ)లో నరేంద్ర మోదీ ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ మార్పుల ప్రకారం పీఎంఏఐ-యూ కింద వడ్డీ సబ్సిడీకి అర్హత పొందిన గృహాల కార్పెట్‌ ఏరియాను 33 శాతం పెంచేందుకు గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఎక్కువ మంది లబ్దిదారులను ఆకర్షించడానికి ప్రభుత్వం ఈ కార్పెట్‌ ఏరియాను పెంచింది. పీఎంఏఐ-యూ కింద పెంచిన కార్పెట్‌ ఏరియా అన్ని మధ్య తరగతి ఆదాయ వర్గాలకు వర్తించనుంది. దీంతో మధ్యతరగతి గ్రూప్‌-1 వారి కార్పెట్‌ ఏరియా 120 చదరపు మీటర్ల నుంచి 160 చదరపు మీటర్లకు పెరిగింది. అదేవిధంగా మధ్యతరగతి గ్రూప్‌-2 వర్గాల వారి కార్పెట్‌ ఏరియా 150 చదరపు మీటర్ల నుంచి 200 చదరపు మీటర్లకు పెంచింది. 

ఎంఐజీ-1 కేటగిరీ కింద రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్యలో ఆదాయం ఉన్నవారికి రూ.9 లక్షల రుణం అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఈ లబ్దిదారులకు 4 శాతం వడ్డీ రాయితీలు అందుతాయి. ఎంఐజీ-2 కేటగిరీ కింద రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి రూ.12 లక్షల వరకు రుణాన్ని 3 శాతం వడ్డీ రాయితీలతో అందిస్తున్నారు. 2022 నాటికి అందరికీ గృహాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కార్పెట్‌ ఏరియా ఇంట్లో గదుల్లోని గచ్చు పరిధి వరకు విస్తరించిన ప్రాంతం. గోడలను మినహాయించి దీన్ని లెక్కిస్తారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top