చుక్కలు చూపిస్తున్న ఆన్‌లైన్ ఎస్‌బీఐ | Gang depositing forged TDR of banks for tenders busted | Sakshi
Sakshi News home page

చుక్కలు చూపిస్తున్న ఆన్‌లైన్ ఎస్‌బీఐ

Dec 16 2015 2:12 AM | Updated on Sep 3 2017 2:03 PM

చుక్కలు చూపిస్తున్న ఆన్‌లైన్ ఎస్‌బీఐ

చుక్కలు చూపిస్తున్న ఆన్‌లైన్ ఎస్‌బీఐ

ఆన్‌లైన్ ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు రోజులుగా చుక్కలు చూపిస్తోంది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్ ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు రోజులుగా చుక్కలు చూపిస్తోంది. ఆన్‌లైన్‌ఎస్‌బీఐ డాట్‌కామ్ ద్వారా అందిస్తున్న ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు సరిగా పనిచేయకపోవడంతో మూడు రోజులుగా వివిధ బిల్లులు చెల్లించడానికి, నగదు బదిలీలు చేయడానికి ప్రయత్నించిన కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులకు డిసెంబర్ 15వ తేదీ ఆఖరు తేదీ కావటంతో...

మంగళవారం రోజున పెద్ద ఎత్తున కస్టమర్లు వీటిని ఆన్‌లైన్లో చెల్లించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ‘‘కొన్ని రోజులుగా ఎస్‌బీఐ ఆన్‌లైన్ సేవలు సరిగా పనిచేయడం లేదు. సరే! అదే సర్దుబాటు అవుతుందిలే అని ఊరుకున్నాం. కానీ అడ్వాన్స్ ట్యాక్స్ చివరి రోజున వెబ్‌సైట్ పూర్తిగా పనిచేయకపోవడంతో ముందస్తు ట్యాక్స్ సకాలంలో చెల్లించలేకపోయా’’ అని ఓ వ్యాపారి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధి వద్ద వాపోయారు.

అలాగే ఈఎంఐలు వంటి ఇతర చెల్లింపులు చేయలేకపోవడంతో పెనాల్టీల వాత పడుతుందన్న ఆందోళనను పలువురు ఖాతాదారులు వ్యక్తం చేశారు. వీటిపై బ్యాంకు ఉన్నతాధికారి ఒకరిని ‘సాక్షి’ సంప్రతించగా... గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ‘‘వీటిని సరిదిద్దడానికి ముంబైలోని బృందం యుద్ధప్రాతిపదికన కృషి చేస్తోంది.

ప్రస్తుతం ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయి కానీ మధ్యమధ్యలో ఆగిపోతున్నాయి. మంగళవారం అర్థరాత్రిలోగా ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది’’ అని వివరించారు. సకాలంలో చెల్లింపులు చేయలేని వారిపై పెనాల్టీలు విధించకూడదన్న దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. బ్యాంక్ తప్పిదం వల్ల చెల్లింపులు చేయలేకపోవడంతో పెనాల్టీ విధించకుండా బ్యాంకు తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement