ఫాక్స్‌కాన్‌- భారీ పెట్టుబడి, ఉద్యోగాల బాట!

Foxconn to invest 1 billion dollars in Tamilnadu plant  - Sakshi

100 కోట్ల డాలర్ల( రూ. 7500 కోట్లు) ఇన్వెస్ట్‌మెంట్స్‌

తమిళనాడు ప్లాంటులో అదనంగా 6,000 మందికి ఉపాధి

యాపిల్‌ ఐఫోన్ల తయారీ, అసెంబ్లింగ్‌ కార్యక్రమాల పెంపు 

చైనాపై వ్యతిరేకత నేపథ్యంలో తాజా ప్రణాళికలు

తైవాన్‌లోని తైపీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఫాక్స్‌కాన్‌ దేశీయంగా బిలియన్‌ డాలర్ల(రూ. 7500 కోట్లు)ను ఇన్వెస్ట్‌ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రధానంగా కాంట్రాక్ట్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ సేవలను అందిస్తుంటుంది. కంపెనీ కస్లమర్లలో యూఎస్‌ టెక్‌ దిగ్గజం యాపిల్‌ను ప్రధానంగా పేర్కొనవచ్చు. యాపిల్‌ తయారీ ఐఫోన్ల అసెంబ్లింగ్‌ను చేపడుతుంటుంది. ఇటీవల యూఎస్‌, చైనా మధ్య తలెత్తిన వాణిజ్య వివాదాలు, కరోనా వైరస్  తదితర సవాళ్ల నేపథ్యంలో దేశీయంగా తయారీని విస్తరించాలని ఫాక్స్‌కాన్‌ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు ప్రధానంగా యాపిల్‌ నుంచి ఒత్తిడి(బిజినెస్‌) పెరుగుతుండటంతో తాజా ప్రణాళికలకు తెరతీసినట్లు తెలియజేశాయి. అయితే కస్లమర్ల విషయాలకు సంబంధించి మాట్లడబోమని ఫాక్స్‌కాన్‌ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. 

ఐఫోన్‌ XR ప్లాంటులో
ఇప్పటికే చెన్పైలోని శ్రీపెరంబూర్‌ ప్లాంటులో  యాపిల్ ఎక్స్‌ఆర్‌ మోడల్‌ ఐఫోన్లను ఫాక్స్‌కాన్‌ తయారు చేస్తోంది. ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా మరిన్ని మోడళ్ల ఐఫోన్లను రూపొందించాలని భావిస్తోంది. తద్వారా చైనాలో  ఫాక్స్‌కాన్‌ చేపడుతున్న ఐఫోన్‌ తయారీ కార్యకలాపాలను కొంతమేర దేశీయంగా తరలించే యోచనలో ఉన్నట్లు అంచనా. వెరసి ఇక్కడ అదనంగా 6,000 మందికి ఉపాధి కల్పించవలసి ఉంటుందని విశ్లేషకులు తెలియజేశారు. ఇప్పటికే దేశీయంగా స్టార్ట్‌ ఫోన్ల విక్రయాలలో యాపిల్‌ ఐఫోన్లు 1 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

ఏపీలోనూ
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ప్లాంటు ద్వారా చైనా కంపెనీ షియోమీ కార్ప్‌సహా పలు ఇతర కంపెనీల స్మార్ట్‌ ఫోన్లను ఫాక్స్‌కాన్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. మరోవైపు బెంగళూరు ప్లాంటులో యాపిల్‌ ఐఫోన్లలో కొన్ని మోడళ్లను అసెంబ్లింగ్‌ చేస్తున్న తైవాన్‌ కంపెనీ విస్ట్రన్‌ కార్ప్‌ సైతం ఫాక్స్‌కాన్‌ తరహా ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా యాపిల్‌ కంపెనీకి చెందిన ఇతర ప్రొడక్టుల‌ తయారీని సైతం చేపట్టాలని యోచిస్తున్నట్లు సంబంధితవర్గాలు వెల్లడించాయి. 

మేకిన్‌ ఇండియా
దేశీయంగా ఎలక్ట్రానిక్స్‌ తయారీని ప్రోత్సాహించేందుకు గత నెలలో కేంద్ర ప్రభుత్వం 6.65 బిలియన్‌ డాలర్ల(రూ. 50,000 కోట్లు) విలువైన ప్రణాళికను ప్రకటించింది. దీనిలో భాగంగా దేశీయంగా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కార్యకలాపాలు ప్రారంభిస్తే గ్లోబల్‌ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించనుంది. వెరసి ప్రధాని మోడీ ప్రకటించిన మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి మరింత మద్దతు లభించనుంది. అంతేకాకుండా కొత్తగా ఉద్యోగ కల్పనకు దారి ఏర్పడుతుందని పరిశ్రమవర్గాలు తెలియజేశాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top