యాపిల్, అమెజాన్‌ చేతిలో ‘ఫేస్‌బుక్‌’

Facebook Reportedly Gave Personal Data To 60 Companies Including Apple, Amazon - Sakshi

10 ఏళ్లుగా పరికర తయారీ సంస్థలకు అందుతున్న యూజర్ల డేటా

వాషింగ్టన్‌: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మరోసారి చిక్కుల్లో పడింది. తమ వినియోగదారుల భద్రతే ముఖ్యమని మాటలు చెబుతున్న ఫేస్‌బుక్‌.. చేతల్లో మాత్రం యూజర్ల డేటాను ఇతరులకు కట్టబెట్టే ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. తాజాగా ఫేస్‌బుక్‌ తమ వినియోగదారుల సమాచారాన్ని యాక్సెస్‌ చేసుకునేలా 60 పరికరాల తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ సంచలనాత్మక విషయాన్ని బయటపెట్టింది.

ఫేస్‌బుక్‌ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలతో ఇటీవల వరకు ఉక్కిరిబిక్కిరైన ఫేస్‌బుక్‌ సంస్థ తాజా ఉదంతంతో మరోసారి వార్తల్లోకెక్కింది. తాజా వివాదంలో ప్రముఖ పరికరాల తయారీ సంస్థలు యాపిల్, అమెజాన్, బ్లాక్‌బెర్రీ, మైక్రోసాఫ్ట్, సామ్‌సంగ్‌లతోపాటు మరికొన్ని సంస్థలకు గత దశాబ్ద కాలంగా ఫేస్‌బుక్‌ తన యూజర్ల సమాచారాన్ని యాక్సెస్‌ చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ బహిర్గతం చేసింది.

యూజర్ల అనుమతి లేకుండా.. డివైజ్‌ తయారీదారులకు ఫేస్‌బుక్‌ తన యూజర్ల ప్రొఫెల్‌ వివరాలతోపాటు ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో ఉన్న వారి వ్యక్తిగత వివరాలను కూడా యాక్సెస్‌ చేసుకునేలా పర్మిషన్‌ ఇచ్చిందని పేర్కొంది. ఫేస్‌బుక్‌ తన వ్యాపారాన్ని మరింత విస్తృత పరుచుకునేందుకు ఈ ఒప్పందాలు పనిచేస్తున్నాయని వెల్లడించింది. పరికర తయారీ సంస్థలు యూజర్ల డేటాను ఉపయోగించి మెసేజింగ్, లైక్‌ బటన్, అడ్రస్‌ బుక్‌ లాంటి ఫీచర్లను వారివారి పరికరాల్లో పొందుపరిచేవని పేర్కొంది.

వీటిలో కొన్ని సంస్థలైతే యూజర్ల ఫ్రెండ్స్‌ లిస్ట్‌లోని వారి ఖాతాల నుంచి కూడా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేవని తెలిపింది. తాజా వివాదంతో మరోసారి ఫేస్‌బుక్‌ వ్యక్తిగత గోప్యత భద్రతా విధానాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ప్రైవసీ రీసెర్చర్‌ సెర్గీ ఎగ్లిమన్‌ స్పందిస్తూ.. ‘పరికర తయారీ సంస్థలను విశ్వసనీయమైన సంస్థలుగా ఫేస్‌బుక్‌ భావిస్తుండొచ్చు. అయితే పరికర సంస్థల డివైజ్‌లలో ఉంచిన సమాచారాన్ని యూజర్లు వాడే ఇతర థర్డ్‌ పార్టీ యాప్స్‌ గనుక యాక్సెస్‌ చేయగలితే అది తీవ్రమైన గోప్యతా, భద్రతా పరమైన ప్రమాదంగా మారుతుంది’అని వివరించారు.

ఆరోపణల్ని కొట్టిపారేసిన ఫేస్‌బుక్‌..
తాజాగా చెలరేగిన ఆరోపణలను ఫేస్‌బుక్‌ కొట్టిపారేసింది. ఫేస్‌బుక్‌ గోప్యతా విధానంలో ఉన్న ప్రకారమే సంస్థ నడుచుకుంటున్నట్లు వివరించింది. పరికర తయారీ సంస్థలతో చేసుకున్న ఈ ఒప్పందాలు యాప్‌ డెవలపర్లు తమ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకునే దానికి భిన్నంగానే ఉన్నాయని ఫేస్‌బుక్‌ సహాధ్యక్షుడు ఇమీ అర్షిబాంగ్‌ పేర్కొన్నారు.

డెవలపర్లు గేమ్స్, ఇతర సర్వీసుల కోసం యూజర్ల డేటాను వాడుకుంటారని.. అయితే తయారీ సంస్థలు ఫేస్‌బుక్‌ వర్షన్లకు సంబంధించిన విషయాలకై మాత్రమే డేటాను ఉపయోగిస్తాయని తెలిపారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top