ఫేస్‌బుక్‌ సీఈవోకి చుక్కలు చూపించారు!

Facebook CEO Mark Zuckerberg Survives 10 Hours Of Questioning By Congress - Sakshi

కేంబ్రిడ్జ్‌ అనలిటికా డేటా చోరి ఉదంతంపై తొలి రోజు ఎక్కడా తడబాటు, కంగారు లేకుండా.. చాలా కూల్‌గా, కామ్‌గా అంతకు మించి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ సమాధానాలు చెప్పిన ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌కు, రెండో రోజు అమెరికన్‌ సెనేటర్లు చుక్కలు చూపించారు. మొదటి రోజుతో పోలిస్తే, రెండో రోజు కఠినతరమైన ప్రశ్నలతో జుకర్‌బర్గ్‌ను గుక్క తిప్పుకోనివ్వలేదు. కంపెనీ డేటా సేకరణ అంశాలపై సెనేటర్లు సమాధానం చెప్పలేని ప్రశ్నలనే సంధించారు. ఒకానొక దశలో జుకర్‌బర్గ్‌ తీవ్ర అసహనానికి కూడా గురయ్యారు. వినియోగదారుల గోప్యతకు మించి పలు అంశాలపై కూడా ఆయన్ని ప్రశ్నించారు. బుధవారం హౌజ్‌ ఎనర్జీ, కామర్స్‌ కమిటీ ముందు హాజరైన జుకర్‌బర్గ్‌కు దాదాపు ఐదు గంటల పాటు చట్టసభ్యులు ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. మొత్తంగా రెండో రోజులు 100 మంది చట్టసభ్యులు 10 గంటల పాటు జుకర్‌బర్గ్‌ను విచారించినట్టు తెలిసింది. కేంబ్రిడ్జ్‌ అనలిటికా డేటా స్కాండల్‌పై అమెరికన్‌ కాంగ్రెస్‌ జరిపిన తుది విచారణ ఇంతటితో ముగిసింది. 

ఈ విచారణలో కూడా జుకర్‌బర్గ్‌ పదే పదే తాను పెద్ద తప్పు చేశానని ఒప్పుకున్నారు. కానీ ఇలాంటి సమాధానం ఇచ్చే ఛాన్స్‌ మళ్లీ ఇవ్వకుండా కేవలం ‘యస్‌’ లేదా ‘నో’  రూపంలో మాత్రమే సమాధానం చెప్పేలా న్యూజెర్సీకి చెందిన డెమొక్రాటిక్‌ ప్రతినిధి ఫ్రాంక్‌ పలోన్‌ ప్రశ్నలు సంధించారు. డేటా సేకరణను తగ్గించడానికి ఏమైనా డీఫాల్ట్‌ సెట్టింగ్స్‌ను ఫేస్‌బుక్‌ మార్చడానికి సిద్ధంగా ఉందా? అనే ప్రశ్న పలోన్‌ అడిగారు.  కానీ ఇది చాలా క్లిష్టమైన అంశమని, కేవలం ఒక్క పదంతో సమాధానం చెప్పలేమని జుకర్‌బర్గ్‌ అన్నారు. దీంతో మీ సమాధానం తమల్ని నిరాశకు గురిచేసిందని పలోన్‌ అన్నారు. 

2011లో ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ఫేస్‌బుక్‌ డేటా పాలసీ, థర్డ్‌ పార్టీ యాప్స్‌తో కలిసి ఉల్లంఘిస్తుందనే అంశంపై పలువురు చట్టసభ్యులు ప్రశ్నలు సంధించారు. ఒకవేళ అలా చేస్తే, భారీ మొత్తంలో జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ ప్లాట్‌ఫామ్‌పై అక్రమంగా ఒపియాడ్స్‌ను విక్రయించుకునేందుకు అనుమతి ఇస్తూ... యూజర్లను ఫేస్‌బుక్‌ బాధపరుస్తుందని ఓ చట్టసభ్యుడు మండిపడ్డారు. ఇప్పటి వరకు జుకర్‌బర్గ్‌ చెప్పిన క్షమాపణల లెక్కలు తీసిన ఇల్లినాయిస్‌కు చెందిన ఓ డెమొక్రాట్‌, తమ స్వీయ నియంత్రణ సంస్థ పనిచేయడం లేదనడానికి ఇదే రుజువు అని చురకలు అంటించారు. యూజర్లు కానీ వారి డేటాను కూడా ఫేస్‌బుక్‌ షాడో ప్రొఫైల్స్‌తో సేకరిస్తుందంటూ డెమొక్రాటిక్ సహోద్యోగి, న్యూ మెక్సికో ప్రతినిధి బెన్ లుజాన్ ఆరోపించారు. ఇలా కేంబ్రిడ్జ్‌ అనలిటికాతో ఫేస్‌బుక్‌ షేర్‌చేసిన 8.7 కోట్ల మంది డేటా ఉదంతంపై చట్టసభ్యులు ప్రశ్నలు మీద ప్రశ్నలు సంధించారు. కానీ సమయం తక్కువగా ఉండటంతో ఒక్కొక్క చట్టసభ్యునికి కేవలం 5 నిమిషాలు సమయం మాత్రమే కేటాయించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top