‘ఎలక్ట్రో షూ’తో ఆకతాయిలకు చెక్‌!  | Sakshi
Sakshi News home page

 ‘ఎలక్ట్రో షూ’తో ఆకతాయిలకు చెక్‌! 

Published Sun, Sep 24 2017 12:53 AM

Electro shoe for woman

దేశంలో మహిళల కోసం ఎన్నో చట్టాలున్నప్పటికీ వారిపట్ల లైంగిక వేధింపులు ఆగడం లేదు.. ఎంతో మంది నిర్భయలను అక్కడక్కడ మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం.. ఈ పరిస్థితుల్లో ఆకతాయిల నుంచి మహిళలు వారిని వారే కాపాడుకోగలగాలి.. ఈ క్రమంలో పెప్పర్‌ స్ప్రే వంటి వాటిని కొందరు మహిళలు తమ పర్సుల్లో పెట్టుకుని తిరుగుతుంటారు. అదే కోవలోకి వస్తుంది ఈ చెప్పు. ఈ చెప్పు కూడా మహిళలను ఆకతాయిల నుంచి కాపాడుతుంది. అదెలాగంటే... ఆకతాయిలు వేధిస్తున్నప్పుడు వారిని ఈ చెప్పు కాలితో తన్నితే సరిపోతుంది. ఆ చెప్పు ద్వారా కరెంట్‌ షాక్‌ తగిలి వారికి తగిన శాస్తి జరుగుతుంది.

ఆకతాయిల అకృత్యాలను చూసి కలతచెందిన తెలంగాణ వాసి సిద్ధార్థ్‌ మందాలా మహిళల భద్రత కోసం ఏదన్నా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఎలక్ట్రోషూపై కొన్ని ఏళ్లుగా శ్రమించి వాటికి తుదిరూపు తీసుకొచ్చాడు. మహిళను ఎవరైనా ఆకతాయి వేధింపులకు గురిచేసినపుడు ఆ సమయంలో సదరు మహిళ వాడిని ఒక తన్ను తన్నితే చాలు.. వాడి శరీరంలోకి 0.1 ఆంపియర్ల విద్యుత్‌ ప్రవహిస్తుంది. అంతేకాకుండా తాను ప్రమాదంలో ఉన్నాననే సమాచారాన్ని పోలీసులకు చేరవేసి, వారిని, కుటుంబ సభ్యులను అలర్ట్‌ చేస్తుంది.

ఈ చెప్పులను వేసుకుని నడుస్తూ వెళితే అందులోని సర్క్యూట్‌ బోర్డు ద్వారా దానంతట అదే చార్జ్‌ అవుతుంది. మహిళ ఎంత నడిస్తే అంత శక్తి ఉత్పత్తి జనిస్తుంది. అలా ఉత్పత్తి అయిన విద్యుత్‌ రీచార్జబుల్‌ బ్యాటరీలో స్టోర్‌ అవుతుంది. ఎంతో మంది ప్రొఫెసర్లు, ఇంజనీర్ల సహాయంతో చాలా ఏళ్లు కృషి చేసి ఈ ఎలక్ట్రోషూను సిద్ధార్థ్‌ తయారుచేశాడు. ప్రస్తుతం ఈ షూ కొందామని మాత్రం ప్రయత్నించకండి.. ఎందుకంటే ఇది ఇంకా మార్కెట్‌లోకి రాలేదు. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలోనే ఉంది. అంతేకాకుండా చెప్పు రూపంలోనే కాకుండా బూట్ల రూపంలోనూ దీన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. 
 

Advertisement
Advertisement