వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక బ్రేకులు

Donald Trump, Xi Jinping agree to suspend new tariffs, end trade war - Sakshi

అమెరికా, చైనా సంధి!!

వివాదాల పరిష్కారానికి నిర్ణయం

ప్రస్తుతానికి కొత్త టారిఫ్‌లు విధించబోమని ట్రంప్‌ హామీ

వాణిజ్య లోటు భర్తీకి జిన్‌పింగ్‌ భరోసా

బ్యూనస్‌ ఎయిర్స్‌: దాదాపు ఆరు నెలలుగా వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేసిన అమెరికా, చైనాల మధ్య  ఎట్టకేలకు సంధి కుదిరింది. వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ప్రస్తుతానికి కొత్తగా మరిన్ని టారిఫ్‌లు విధించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హామీ ఇవ్వగా.. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు భర్తీకి చర్యలు తీసుకుంటామని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ భరోసానిచ్చారు. వార్షిక జీ–20 సదస్సు సందర్భంగా దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన విందు సమావేశంలో ఈ మేరకు ఇరువురు అంగీకారానికి వచ్చారు.

2019 జనవరి 1 నుంచి 200 బిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను 25 శాతానికి పెంచకుండా.. ప్రస్తుతం 10 శాతానికే పరిమితం చేసేందుకు ట్రంప్‌ అంగీకరించారు. ప్రతిగా 375 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉన్న వాణిజ్య లోటును తగ్గించేందుకు అమెరికా ఉత్పత్తులు భారీ ఎత్తున కొనుగోలు చేసేందుకు జి జిన్‌పింగ్‌ అంగీకారం తెలిపారు. ’అమెరికా, చైనాలకు అపరిమిత ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఫలవంతమైన చర్చలు జరిగాయి’  అని ట్రంప్‌ పేరిట విడుదల చేసిన ప్రకటనలో వైట్‌హౌస్‌ వెల్లడించింది. ట్రేడ్‌వార్‌కు తాత్కాలికంగా బ్రేకులు వేసే దిశగా ట్రంప్, జిన్‌పింగ్‌ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ చైనా మీడియా కథనాలు ప్రచురించింది.  

90 రోజుల వ్యవధి..
ముందుగా ప్రతిపాదించినట్లు జనవరి 1 నుంచి టారిఫ్‌లను 10 శాతం నుంచి 25 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు, దీంతో ఈ అంశంపై మరిన్ని చర్చలకు ఆస్కారం లభించినట్లు వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరి సారా సాండర్స్‌ తెలిపారు. వాణిజ్య లోటు భర్తీ క్రమంలో అమెరికా నుంచి వ్యవసాయ, ఇంధన, పారిశ్రామికోత్పత్తులు మొదలైనవి గణనీయంగా కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించినట్లు ఆమె పేర్కొన్నారు. టెక్నాలజీ బదలాయింపు, మేథోహక్కుల పరిరక్షణ తదితర అంశాలపై తక్షణం చర్చించేందుకు ట్రంప్, జిన్‌పింగ్‌ నిర్ణయించినట్లు వివరించారు. ఇరు పక్షంలో 90 రోజుల్లోగా ఒక అంగీకారానికి రాలేకపోయిన పక్షంలో 10 శాతం సుంకాలను 25 శాతానికి పెంచడం జరుగుతుందన్నారు. గతంలో తిరస్కరించిన క్వాల్‌కామ్‌–ఎన్‌ఎక్స్‌పీ డీల్‌ తన ముందుకు వచ్చిన పక్షంలో ఈసారి ఆమోదముద్ర వేసేందుకు జిన్‌పింగ్‌ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు శాండర్స్‌ వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top