బంగారం మెరుపు పదిలం! | Sakshi
Sakshi News home page

బంగారం మెరుపు పదిలం!

Published Mon, Mar 27 2017 12:09 AM

బంగారం మెరుపు పదిలం!

డాలర్‌ ఇండెక్స్‌ 100 డాలర్ల దిగువకు పడిన నేపథ్యం  
దేశంలోనూ ఇదే దూకుడు 
రెండు వారాల్లో రూ.500 అప్‌


న్యూయార్క్‌/ముంబై: అటు అంతర్జాతీయ మార్కెట్‌లో అందుకు అనుగుణంగా దేశీయ మార్కెట్‌లో పసిడి దూకుడు కొనసాగుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ పతనం కొనసాగుతుండడం దీనికి ప్రధాన కారణం. వివరాల్లోకి వెళితే 24వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో డాలర్‌ ఇండెక్స్‌ 100 డాలర్ల దిగువకు అంటే 99.59 స్థాయికి చేరింది. వారం వారీగా చూస్తే 101 డాలర్ల నుంచి ఈ స్థాయికి డాలర్‌ ఇండెక్స్‌ దిగివచ్చింది. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌– నైమెక్స్‌లో పసిడి ధర ఔన్స్‌ (31.1గ్రా) వారం వారీగా 14 డాలర్లు పెరిగి 1,243 డాలర్లకు చేరింది.  ఈ నెల 15న అమెరికా ఫెడ్‌– ఫండ్‌ రేటును 0.25 శాతం (0.75 శాతం – 1 శాతం శ్రేణికి) పెంచిన తరువాత, అనూహ్య రీతిలో డాలర్‌ బలహీనత– బంగారం బలోపేతం జరుగుతున్న విషయం తెలిసిందే.

17వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి దాదాపు 25 డాలర్లు పెరిగింది. డాలర్‌ బలహీనత కొనసాగితే, పసిడి మరింత ముందుకు కదలడం ఖాయమని తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ గెలిస్తే ఆయన అనుసరించే ‘డాలర్‌ బలహీనత’ విధానాల వల్ల పసిడి 1,800 డాలర్లకు క్రమంగా చేరుతుందని అధ్యక్ష ఎన్నికలకు ముందు పలు విశ్లేషణలు వెలువడ్డాయి. కాగా పసిడికి 1,200 డాలర్ల వద్ద మద్దతు ఉందనీ, ఇది పోతే 1,170 డాలర్ల వద్ద మరో మద్దతు ఉందనీ విశ్లేషకులు చెబుతున్నారు.

దేశీయంగా...
అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్‌ మార్కెట్‌పైనా పడుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌ (ఎంసీఎక్స్‌)లో బంగారం ధర 10 గ్రాములకు 24వ తేదీతో ముగిసిన వారంలో రూ.284 పెరిగి రూ.28,793కి చేరింది. రెండు వారాల్లో ఇక్కడ ధర దాదాపు రూ.400 పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్‌ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.255 పెరిగి రూ.28,895కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.28,745కి ఎగసింది. రెండు వారాల్లో ధర దాదాపు రూ.500 పెరిగింది. వెండి కేజీ ధర రూ. 335 పెరిగి రూ.41,660కు పెరిగింది. రెండు వారాల్లో ధర రూ.550కి పైగా ఎగసింది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement