ధనుకా అగ్రిటెక్‌- ఇన్ఫో ఎడ్జ్‌.. జూమ్

Dhanuka agritech- Info Edge India jumps - Sakshi

సెన్సెక్స్‌ 274 పాయింట్లు అప్‌

11,000కు చేరులో కదులుతున్న నిఫ్టీ

52 వారాల గరిష్టానికి ధనుకా అగ్రిటెక్‌

చరిత్రాత్మక గరిష్టాన్ని తాకిన ఇన్ఫో ఎడ్జ్‌

వరుసగా మూడో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 274 పాయింట్లు జంప్‌చేసి 37,294ను తాకగా.. నిఫ్టీ 82 పాయింట్లు బలపడి 10,983 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా అగ్రికెమికల్స్‌ కంపెనీ ధనుకా అగ్రిటెక్‌, ఆన్‌లైన్‌ క్లాసిఫైడ్స్‌ సంస్థ ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ధనుకా అగ్రిటెక్‌
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కు ప్రతిపాదించినట్లు వెల్లడించడంతో ధనుకా అగ్రిటెక్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌ఎస్ఈలో ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 871 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 936 వరకూ దూసుకెళ్లింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! ఈ నెల 22న(బుధవారం) బోర్డు సమావేశంకానున్నట్లు ధనుకా అగ్రిటెక్‌ వెల్లడించింది. సమావేశంలో భాగంగా బోర్డు ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ అంశాన్ని పరిశీలించనున్నట్లు తాజాగా తెలియజేసింది. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌) ఫలితాలను సైతం వెల్లడించనున్నట్లు వివరించింది. జూన్‌ చివరికల్లా కంపెనీలో ప్రమోటర్లు 75 శాతం వాటాను కలిగి ఉన్నారు. మిగిలిన 25 శాతం వాటాలో మ్యూచువల్‌ ఫండ్స్‌కు 12.83 శాతం వాటా ఉంది. రిటైలర్ల వాటా 8.57 శాతంగా నమోదైంది. 

ఇన్ఫో ఎడ్జ్ ఇండియా
ఆన్‌లైన్‌ బీమా రంగ సేవలందించే పాలసీ బజార్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టే యోచనలో ఉన్నట్లు వెల్లడించడంతో ఇన్ఫో ఎడ్జ్ ఇండియా కౌంటర్‌ జోరందుకుంది. ఎన్‌ఎస్ఈలో ప్రస్తుతం 3.25 శాతం జంప్‌చేసి రూ. 3211 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 3238 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం! నౌకరీ, జీవన్‌సాథీ, 99 ఏకర్స్‌.కామ్‌ల మాతృ సంస్థ ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా జొమాటో, పాలసీ బజార్‌, మెరిట్‌నేషన్‌ తదితర ఇంటర్నెట్‌ కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే. రూ. 1,100 కోట్ల సమీకరణకు పాలసీ బజార్‌ పబ్లిక్‌ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా.. పాలసీ బజార్‌ ఐపీవో ద్వారా కంపెనీ షేరుకి రూ. 190 స్థాయిలో అదనపు విలువ చేకూరగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top