ఈ కామర్స్‌పై అతి నియంత్రణతో నష్టమే!

 Control over this e-commerce sector - Sakshi

వ్యాపార ఏర్పాటు వాతావరణం  దెబ్బతింటుంది 

ఇన్స్‌పెక్టర్‌రాజ్‌కు దారితీస్తుంది 

అసోచామ్‌ ఆందోళన

హైదరాబాద్‌: ఈ కామర్స్‌ రంగంపై అతి నియంత్రణ దేశంలో నూతన వ్యాపారాల ఏర్పాటు వాతావరణాన్ని దెబ్బతీస్తుందని పారిశ్రామిక సంఘం అసోచామ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ధరల్ని ప్రభుత్వం నియంత్రించడమనేది తిరిగి ఇన్స్‌పెక్టర్‌ రాజ్‌కు దారితీస్తుందని వ్యాఖ్యానించింది. ఈ కామర్స్, మొత్తం ఆన్‌లైన్‌ విభాగం ఇప్పడిప్పుడే ఎదుగుతోందని, దీని విస్తరణకు ఎంతో అవకాశం ఉందని అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ డీఎస్‌ రావత్‌ పేర్కొన్నారు. ‘‘ఏ వాణిజ్యానికి అయినా నిబంధనలన్నవి ఉండాల్సిందే. కానీ, అతి నిబంధనలు, అతి నియంత్రణలన్నవి అమలు చేయరాదు. ఇది వ్యాపార స్థాపన వృద్ధిని అణచివేస్తుంది’’ అని రావత్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఈ కామర్స్‌ విధానాన్ని తీసుకొస్తున్న విషయం తెలిసిందే.

ఈ విధాన ముసాయిదాపై భాగస్వాముల అభిప్రాయాలను కోరింది. దీంతో అసోచామ్‌ గట్టిగా స్పందించడం గమనార్హం. వివిధ రకాల ధరల్ని అమలు చేయడం లేదా భారీ తగ్గింపులకు కాల పరిమితి విధింపు కూడా ఈ కామర్స్‌ విధానంలో ఉంది. ఈ కామర్స్‌ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ సంప్రదాయ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ నూతన విధానంపై దృష్టి సారించింది. కానీ భారీ తగ్గింపులన్నవి లేదా అసలు తగ్గింపులు లేకపోవడం అన్నది వ్యాపార పరమైన నిర్ణయాలని రావత్‌ పేర్కొన్నారు. భారీ తగ్గింపులపై ఆందోళన ప్రమోటర్లకు, వెంచర్‌ క్యాపిటలిస్టులు, ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్‌కే ఉండాలన్నారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top