
న్యూఢిల్లీ: టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా సెల్యులర్ ఆపరేటర్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) ఆరోపణలను కొట్టిపారేసింది. నిరూపించలేని ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించింది. జియో పేరు ప్రస్తావించకుండానే ట్రాయ్ ఆర్డర్లు ఒక ఆపరేటర్‌కు మాత్రమే లబ్ధి కలిగించేలా ఉన్నాయని సీవోఏఐ ఆరోపించిన విషయం తెలిసిందే. ‘రెగ్యులేటరీ పారదర్శకంగా పనిస్తోంది. సీవోఏఐకి ట్రాయ్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం అలవాటుగా మారింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి’ అని ట్రాయ్ సెక్రటరీ ఎస్‌కే గుప్తా చెప్పారు. సీవోఏఐ చేసిన ఆరోపణలకు అర్థం లేదని, నిరాధారమైనవని తెలిపారు.
తగిన మార్గాలను అన్వేషిస్తున్నాం: సీవోఏఐ
ట్రాయ్ రియాక్షన్‌పై సీవోఏఐ స్పందించింది. ‘చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నాం. ప్రిడేటరీ ప్రైసింగ్‌కు (ఒక కంపెనీ ఇతర కంపెనీలు పోటీపడలేని స్థాయిలో తన సర్వీసులను తక్కువ ధరకు అందించడం. దీని వల్ల మిగిలిన కంపెనీలు చివరకు బలవంతంగా వాటి కార్యకలాపాలు మూసివేయాల్సి వస్తుంది) సంబంధించి ట్రాయ్ నిర్ణయాలకు వ్యతిరేకంగా మేం చేసిన ఫిర్యాదుల విషయమై వీలైతే టెలికం విభాగం, పీఎంవో కార్యాలయాలను సంప్రదిస్తాం’ అని పేర్కొంది. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి తమ ఆపరేటర్లు ఒకటి లేదా రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. కాగా సీవోఏఐ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో.. గత 12–18 నెలల్లో ట్రాయ్ తీసుకున్న నిర్ణయాలు ఒక ఆపరేటర్‌కు మాత్రమే అనుకూలముగా, మిగిలిన వాటికి ప్రతికూలముగా ఉన్నాయని ఆరోపించింది.