
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో టీజీఎస్‌పీడీసీఎల్ సిబ్బంది కొనసాగిస్తున్న, చట్టవిరుద్ధమైన ఫైబర్ కోతలను సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) ఖండించింది. ఆగస్టు 22న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తూ ఈ చర్యలు కొనసాగుతున్నాయని అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
నగరంలోని బంజారాహిల్స్, కూకట్ పల్లి, మాదాపూర్, కొండాపూర్, హబ్సిగూడ, చంపాపేట్, మణికొండ, సికింద్రాబాద్, కొంపల్లి తదితర ప్రాంతాల్లో ఫైబర్ కోతలు ఎక్కువగా నమోదవుతున్నాయని, దీంతో టెలికాం ఫైబర్ తెగిపోవడంతో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని సీఓఏఐ తెలిపింది.
గత కొన్ని రోజులుగా ఇది పరిస్థితిని మరింత దిగజార్చిందని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన కనెక్టివిటీపై ప్రభావం చూపుతోందని తెలిపింది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ఆగస్టు 25న టీజీఎస్ పీడీసీఎల్ కు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించినప్పటికీ, మళ్లీ ఫైబర్ కోతలతో ఈ ఉత్తర్వును స్పష్టంగా ఉల్లంఘిస్తూనే ఉందని సీఓఏఐ ఆక్రోశించింది.
టెలికమ్యూనికేషన్స్ యాక్సెస్ అనేది కేవలం ఒక సేవ మాత్రమే కాదని, ఇది నేటి డిజిటల్ యుగంలో ప్రాథమిక హక్కు, జీవనాధారమని సీఓఏఐ తెలిపింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి, కీలకమైన టెలికాం మౌలిక సదుపాయాల రక్షణను నిర్ధారించడానికి, ఈ పునరావృత ఉల్లంఘనలకు పాల్పడినవారిని చట్ట ప్రకారం బాధ్యులను చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని అసోసియేషన్ ప్రకటనలో కోరింది.