ఐసీఐసీఐకి కొచర్‌ రాజీనామా!!

Chanda Kochhar quits ICICI Bank  - Sakshi

అనుబంధ సంస్థల బోర్డుల నుంచి కూడా నిష్క్రమణ

ఆరోపణలపై కొనసాగనున్న విచారణ

కొత్త ఎండీ, సీఈవోగా సందీప్‌ బక్షికి బాధ్యతలు  

న్యూఢిల్లీ: వీడియోకాన్‌ గ్రూప్‌నకు లంచం తీసుకుని రుణం మంజూరు చేశారన్న వివాదం ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచర్‌ పదవికి ఎసరు పెట్టింది. క్విడ్‌ప్రోకో ఆరోపణలపై విచారణ నేపథ్యంలో బ్యాంక్‌ ఎండీ, సీఈవో పదవులకు కొచర్‌ రాజీనామా చేశారు. 2019 మార్చి 31 దాకా ఆమె పదవీ కాలం ఉన్నప్పటికీ ముందుగానే వైదొలిగినట్లయింది. వీటితో పాటు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ సహా ఇతర అనుబంధ సంస్థల నుంచి కూడా ఆమె తప్పుకున్నారు. తాజా పరిణామాలతో కొత్త ఎండీ, సీఈవోగా ప్రస్తుత చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీవోవో) సందీప్‌ బక్షి నియమితులయ్యారు. 2023 అక్టోబర్‌ 3 దాకా అయిదేళ్ల పాటు ఆయన ఈ హోదాల్లో కొనసాగుతారని ఐసీఐసీఐ బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. చందా కొచర్‌పై  బోర్డు మే నెలలో ఆదేశించిన విచారణ యథాప్రకారం కొనసాగుతుందని, దర్యాప్తు ఫలితాలు బట్టి బ్యాంకు నుంచి ఆమెకు అందాల్సిన ప్రయోజనాలు అందటమనేది ఆధారపడి ఉంటుందని పేర్కొంది. రుణ వివాదంపై సుప్రీం కోర్టు మాజీ జస్టిస్‌ బీఎన్‌ శ్రీకృష్ణ సారథ్యంలో బ్యాంకు బోర్డు విచారణ కమిటీ ఏర్పాటు చేసినప్పట్నుంచి చందా కొచర్‌ సెలవులో ఉన్నారు. మరోవైపు, స్వతంత్ర డైరెక్టర్‌ ఎండీ మాల్యా కూడా ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేసినట్లు బ్యాంక్‌ వెల్లడించింది. గురువారం బీఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంకు షేరు సుమారు 4 శాతం పెరిగి దాదాపు రూ. 316 వద్ద ముగిసింది

రుణం తెచ్చిన తంటా.. 
వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.3,250 కోట్ల రుణాలివ్వడం వెనుక చందా కొచర్, ఆమె కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని, ఈ డీల్‌కు ప్రతిఫలంగా వారు భారీ లంచం తీసుకున్నారనే (క్విడ్‌ప్రోకో) ఆరోపణలున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌  నుంచి రుణం పొందినందుకు ప్రతిగా.. చందా కొచర్‌ భర్త దీపక్‌ కొచర్‌కు చెందిన న్యూపవర్‌ రెన్యూవబుల్స్‌ సంస్థలో వీడియోకాన్‌ గ్రూప్‌ అధినేత వేణుగోపాల్‌ ధూత్‌ పెట్టుబడులు పెట్టారనేది ప్రధాన అభియోగం. అంతే కాకుండా ఎస్సార్‌ గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు రవి రూయా అల్లుడు నిషాంత్‌ కనోడియాకు చెందిన మారిషస్‌ సంస్థ ఫస్ట్‌ల్యాండ్‌ హోల్డింగ్స్‌ నుంచీ న్యూపవర్‌లోకి పెట్టుబడులు వచ్చాయి. సరిగ్గా 2010లో ఎస్సార్‌ స్టీల్‌కు ఐసీఐసీఐ బ్యాంక్‌ సారథ్యంలోని కన్సార్షియం 530 మిలియన్‌ డాలర్ల రుణం ఇచ్చిన నెలలోనే.. న్యూపవర్‌లోకి ఫస్ట్‌ల్యాండ్‌ నుంచి పెట్టుబడులు రావడం అనుమానాలకు తావిచ్చింది. ఈ రుణాన్ని బ్యాంకు ఆ తర్వాత మొండిబాకీగా వర్గీకరించింది.

బక్షి.. మూడు దశాబ్దాల బ్యాంకింగ్‌ అనుభవం.. 
ఐసీఐసీఐ బ్యాంక్‌ కొత్త సీఈవోగా నియమితులైన సందీప్‌ బక్షి(58)కి బ్యాంకింగ్‌ రంగంలో సుమారు మూడు దశాబ్దాల పైగా అనుభవం ఉంది. గతంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవోగా వ్యవహరించారు. ఆరోపణలతో కొచర్‌ జూన్‌ నుంచి నిరవధిక సెలవుపై వెళ్లిన నేపథ్యంలో బ్యాంకు తొలుత ఆయన్ను అయిదేళ్ల పాటు హోల్‌టైమ్‌ డైరెక్టర్, సీవోవోగా నియమించింది. 1986 డిసెంబర్‌ 1న బక్షి ఐసీఐసీఐ గ్రూప్‌లోని ప్రాజెక్ట్‌ ఫైనాన్సింగ్‌ విభాగంలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 2002 ఏప్రిల్‌లో ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. 2009 నుంచి 2010 దాకా ఐసీఐసీఐ బ్యాంక్‌ డిప్యుటీ ఎండీగా కూడా వ్యవహరించారు. 2010 ఆగస్టు 1న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు.

పద్మభూషణ్‌ నుంచి  పతనం దాకా...
పురుషాధిపత్యం ఉండే ఆర్థిక రంగంలో శక్తిమంతమైన మహిళగా ఎదిగిన చందా కొచర్‌... అంతలోనే అవమానకర రీతిలో ఐసీఐసీఐ బ్యాంక్‌ చీఫ్‌ హోదా నుంచి నిష్క్ర మించాల్సి రావడం గమనార్హం. ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలు అందుకున్న కొచర్‌ ప్రస్తుతం అవినీతి ఆరోపణలపై విచారణలను ఎదుర్కొంటున్నారు. 1984లో ఐసీఐసీఐ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా చేరాక... చురుకైన పనితీరుతో గ్రూప్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. ఇన్‌ఫ్రా రంగానికి రుణాలిచ్చే సంస్థ స్థాయి నుంచి 1990లలో ఐసీఐసీఐ కమర్షియల్‌ బ్యాంకుగా పరిణామం చెందడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. గ్రూప్‌ చైర్మన్‌ కేవీ కామత్‌ నిష్క్రమణ అనంతరం.. 2009లో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈవో పదవిని దక్కించుకున్నారు. ఇది శిఖా శర్మ (యాక్సిస్‌ బ్యాంక్‌ చీఫ్‌) వంటి ఇతరత్రా సీనియర్ల నిష్క్రమణకు దారి తీసింది. చందా కొచర్‌ తన సారథ్యంలో బ్యాంక్‌ను పటిష్ట స్థానానికి చేర్చారు. ఐసీఐసీఐ బ్యాంక్, చందా కొచర్‌ పర్యాయపదాలుగా మారేంతగా ఆమె ప్రభావం చూపారు. వీడియోకాన్‌కు రుణాలపై ఆరోపణలు వచ్చిన తొలినాళ్లలో బ్యాంకు బోర్డు ఆమెకు పూర్తి మద్దతుగా నిల్చినా .. ఆ తర్వాత విచారణకు ఆదేశించాల్సి వచ్చింది. పనితీరుపరంగా చూస్తే.. ఆమె సీఈవో పగ్గాలు చేపట్టినప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్‌.. దేశీ బ్యాంకింగ్‌ వ్యవస్థలో రెండో స్థానంలోనూ, ప్రైవేట్‌ రంగంలో అగ్రస్థానంలో ఉండేది. కానీ కొచర్‌ వైదొలిగే నాటికి బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఐసీఐసీఐ మూడో స్థానానికి పడిపోయింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top