
ఐసీఐసీఐతో పోలిస్తే ఎస్‌బీఐలో రెట్టింపు
హెచ్‌డీఎఫ్‌సీ కంటే బీఓబీలో రెండింతలు
ప్రైవేటు బ్యాంకుల్లో ‘పైస్థాయి’దే పైచేయి
సాధారణంగా.. ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటురంగ బ్యాంకుల్లో ఉద్యోగులకు జీతాలు ఎక్కువని అందరూ అనుకుంటారు. కానీ, ఇది తప్పు అంటున్నాయి గణాంకాలు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటివి.. దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీల కంటే సగటున ఎక్కువ జీతాలు ఇస్తున్నాయి.
దేశంలో ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అగ్రస్థాయి బ్యాంకులు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ. వీటిలోని ఐసీఐసీఐలో ‘సగటు వేతనం’ రూ.13 లక్షలు కాగా, హెచ్‌డీఎఫ్‌సీలో రూ.11.14 లక్షలు. ఇది చాలా ఎక్కువే అనిపిస్తుంది. కానీ, ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) లలో సగటు వేతనం ఇంతకంటే దాదాపు రెట్టింపు ఉండటం విశేషం. (ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఉన్న ఉద్యోగుల సంఖ్యతో.. ఆ ఏడాదిలో ఉద్యోగుల కోసం చేసిన మొత్తం ఖర్చును భాగిస్తే వచ్చేదే సగటు వేతనం.). ఎస్‌బీఐలో సగటు వేతనం రూ.27.2 లక్షలు కాగా, బీఓబీలో ఇది రూ.22.1 లక్షలు కావడం విశేషం.
పై స్థాయిలో.. అక్కడే ఎక్కువ..
ప్రైవేటు బ్యాంకుల్లోని అత్యున్నత స్థాయి అధికారులు, సీనియర్ మేనేజ్‌మెంట్ స్టాఫ్ మాత్రం.. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే అధిక జీతాలు పొందుతున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ ఎండీ, సీఈఓ 2024–25లో పొందిన వేతనం రూ.12.06 కోట్లు కాగా ఐసీఐసీఐ సీఈఓ సంపాదించింది రూ.10.45 కోట్లు. ఇదే సమయంలో బీఓబీ సీఈఓ పొందింది రూ.73.92 లక్షలు కాగా, ఎస్‌బీఐ చైర్మన్ పొందింది రూ.63.87 లక్షలు.
పే స్కేల్ ప్రకారం..
సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు జూనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో ఎక్కువ ఖర్చు పెడితే.. ప్రైవేటు రంగ బ్యాంకులు సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పే స్కేల్ ప్రకారం జీతం పెరుగుతూ పోతుంటుంది. కానీ, ప్రైవేటు బ్యాంకుల్లో ప్రధానంగా పనితీరు, నైపుణ్యం, వయసు ఆధారంగా పెరుగుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు బ్యాంకులకు ఎంట్రీ లెవెల్‌లో ఎక్కువ ఉద్యోగులు కావాలి. అందువల్ల వారికి జీతాలు తక్కువగా ఉంటాయి.
స్త్రీ, పురుషుల వేతనాల్లో తేడాలు
బోర్డు సభ్యులు, కీలక మేనేజర్ స్థాయి వ్యక్తులను పక్కనపెడితే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పురుష ఉద్యోగి సగటు జీతం రూ.5.6 లక్షలు కాగా, మహిళా ఉద్యోగికి రూ.3.9 లక్షలు. ఇదే ఎస్‌బీఐలో పురుషుల జీతం రూ.13.9 లక్షలు కాగా, స్త్రీలకు రూ.12.8 లక్షలుగా ఉంది.
ఖాళీలు తక్కువే
కేంద్ర ప్రభుత్వం జులైలో రాజ్యసభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ ఏడాది మార్చి 31 నాటికి 96 శాతం సిబ్బంది ఉన్నారు. అంటే కేవలం 3–4 శాతం మాత్రమే ఖాళీలు ఉన్నాయి. 2020–25 మధ్య ఈ బ్యాంకులు 1,48,687 మందిని నియమించుకున్నాయి. 2025–26లో మరో 48,570 మందిని తీసుకోనున్నారు.
ఎస్‌బీఐలోనే అధికం..: 2024–25 నాటికి దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 7.58 లక్షలు. అత్యధిక ఉద్యోగులున్న బ్యాంకుగా ఎస్‌బీఐ నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎస్‌బీఐ సహా సగానికిపైగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2020–21తో పోలిస్తే.. 2024–25లో ఉద్యోగుల సంఖ్య తగ్గింది. ఇక ప్రైవేటు రంగ బ్యాంకుల్లో 2024–25 నాటికి ఐసీఐసీఐలో 1.29 లక్షలు మంది ఉంటే, హెచ్‌డీఎఫ్‌సీలో 2.14 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.