
యూపీఐ (UPI) లావాదేవీలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. 2025 అక్టోబర్‌లో సగటు రోజువారీ లావాదేవీలు.. సెప్టెంబర్‌తో పోలిస్తే 13 శాతం పెరిగి రూ.94,000 కోట్లకు చేరుకున్నట్లు 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (NPCI) వెల్లడించింది.
2025 అక్టోబర్ 18న రూ.1.02 లక్షల కోట్ల విలువైన.. 75.4 కోట్ల యూపీఐ చెల్లింపులు జరిగాయి. ఇది ఒక రోజులో జరిగిన అత్యధిక లావాదేవీలు కావడం విశేషం. జీఎస్టీ సవరణ, ధంతేరాస్, దీపావళి వంటివి చెల్లింపులు పెరగడానికి దోహదపడ్డాయి. అక్టోబర్ నెల ముగియడానికి ఇంకా వారం రోజులు గడువు ఉండగానే లావాదేవీలు గరిష్టాలను తాకినట్లు స్పష్టమవుతోంది.
2025 అక్టోబర్ నెలలో ఇప్పటివరకు సగటున రోజుకు 69.5 కోట్ల లావాదేవీలు జరిగినట్లు సమాచారం. ఇది 2025 సెప్టెంబర్ నెలతో (65.4 కోట్లు) పోలిస్తే 6 శాతం ఎక్కువ. అక్టోబర్ 20 నాటికి.. యూపీఐ రోజువారీ లావాదేవీల విలువ ఆరుసార్లు రూ. లక్ష కోట్లు దాటింది.
సాధారణంగా.. నెల ప్రారంభంలో జీతాలు & ఈఎంఐ చెల్లింపుల కారణంగా లావాదేవీలు ఎక్కువగానే ఉంటాయి. ఆ తరువాత ఖర్చు క్రమంగా తగ్గుతుంది. అయితే ఈ నెలలో పండుగలు రావడంతో.. లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. దీంతో నెలవారీ లావాదేవీ విలువ మొదటిసారిగా రూ.28 లక్షల కోట్లు దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా దేశంలోని మొత్తం డిజిటల్ చెల్లింపులలో.. 85 శాతం వాటా యూపీఐదే కావడం విశేషం.
Empowering your everyday transactions for a smarter tomorrow. Here are the daily stats for 21st October 2025. #AePS #BHIMUPI #IMPS #NETC pic.twitter.com/Pr2uAH6r82
— NPCI (@NPCI_NPCI) October 22, 2025