అక్టోబర్‌లో 2,070 కోట్ల లావాదేవీలు
విలువ రూ. 27.28 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. అక్టోబర్‌లో రూ.27.28 లక్షల కోట్ల విలువ చేసే 2,070 కోట్ల లావాదేవీలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మే నెలలో నమోదైన రూ.25.14 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు గత గరిష్ట రికార్డు కావడం గమనార్హం.
సంఖ్యా పరంగా గత ఆగస్ట్‌లో నమోదైన 2,000 కోట్ల లావాదేవీలు గరిష్ట స్థాయిగా ఉన్నాయి. అక్టోబర్‌లో అటు విలువ పరంగా, ఇటు సంఖ్యా పరంగా యూపీఐ కొత్త రికార్డులు సృష్టించింది. క్రితం ఏడాది అక్టోబర్‌లో రూ.23.49 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. దీంతో పోలి్చతే విలువ పరంగా 16 శాతం పెరుగుదల కనిపించింది. ఇక ఈ ఏడాది సెపె్టంబర్ నెలలోనూ రూ.24.90 లక్షల కోట్ల విలువ చేసే 1,963 కోట్ల లావాదేవీలు జరిగాయి.
అక్టోబర్‌లో రోజువారీ సగటు లావాదేవీలు 66.8 కోట్లుగా ఉన్నాయి. సగటు లావాదేవీ విలువ రూ.87,993గా ఉంది. పండుగల సీజన్ కావడంతో యూపీఐ లావాదేవీలు పెద్ద మొత్తంలో పెరిగినట్టు తెలుస్తోంది. మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 85 శాతం యూపీఐ ద్వారానే కొనసాగుతున్నాయి. పట్టణాల్లోని ప్రజల నిత్య జీవితంలో డిజిటల్ చెల్లింపులు భాగంగా మారాయని స్పైస్‌మనీ సీఈవో దిలీప్ మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్‌లోనూ యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి.
మలేసియాలోనూ యూపీఐ చెల్లింపులు 
యూపీఐ యూజర్లు ఇకపై మలేసియాలోనూ చెల్లింపులు చేసుకోవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకటించింది. ఇందుకు వీలుగా ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్, రేజర్‌పే కర్లక్ మధ్య భాగస్వామ్యం కుదిరింది. దీంతో యూపీ ఐ మరో కొత్త దేశంలోకి అడుగుపెట్టినట్టయింది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
