చందా కొచర్‌కు రూ.25 కోట్ల పెనాల్టీ?

Chanda Kochhar May Face Rs 25 Crore Penalty If Found Guilty - Sakshi

ముంబై : వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంకు ఇచ్చిన రుణ కేసులో ఆ బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచర్‌కు ఉచ్చు బిగిస్తోంది. ఈ రుణ వ్యవహారంలో ఆరోపణలు తీవ్రతరమవుతుండటంతో బ్యాంకు బోర్డు దిగొచ్చి స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించడం, కొచర్‌కు, బ్యాంకుకు వ్యతిరేకంగా సెబీ నోటీసులు జారీచేయడం మరింత చర్చనీయాంశమైంది. చందా కొచర్‌ తప్పు చేయలేదంటూ ఓ వైపు నుంచి బ్యాంకు బోర్డు చెబుతూ వస్తుంది. ఒకవేళ ఈ విచారణలో చందా కొచర్‌ కనుక తప్పు చేసినట్టు వెల్లడైతే, ఆమె భారీ మొత్తంలో పెనాల్టీ ఎదుర్కోవాల్సి వస్తుందని తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం సెబీ జారీచేసిన నోటీసు ప్రకారం ఐసీఐసీఐ బ్యాంకు టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ను ఆ పదవి నుంచి దిగిపోవాలని ఆదేశించే హక్కు లేదని, కానీ భారీ మొత్తంలో పెనాల్టీ విధించే అవకాశముందని మింట్‌ రిపోర్టు చేసింది. ఈ జరిమానా గరిష్టంగా రూ.25 కోట్లు లేదా లబ్ది పొందిన మొత్తంలో మూడింతలు ఉంటుందని తెలిపింది. కానీ చందా కొచర్‌ కేసులో ఎంత జరిమానా విధించాలి అనే విషయంపై సెబీ న్యాయనిర్ణేత అధికారి ఆదేశాలపై ఆధారపడి ఉంటుందని రిపోర్టు పేర్కొంది.

వీడియోకాన్‌కు రుణాలు జారీచేసిన లావాదేవీల వివరాలను వెల్లడించే విషయంలో లిస్టింగ్‌ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు సెబీ తన నోటీసుల్లో పేర్కొంది. నేడు అమెరికా మార్కెట్‌ రెగ్యులేటరీ ఎస్‌ఈసీ కూడా ఈ కేసుపై దృష్టిసారించినట్టు తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకు అమెరికాలో కూడా లిస్ట్‌ అయి ఉండటమే దీనికి కారణం. ఈ కేసులో మరిన్ని వివరాల కోసం సెబీని ఎస్‌ఈసీ ఆశ్రయించింది. ప్రస్తుతం చందాకొచర్‌ సీబీఐ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి కూడా విచారణనను ఎదుర్కొంటున్నారు. వీడియోకాన్ గ్రూపునకు 2012లో అక్రమంగా రూ.3,250 కోట్ల రుణ మంజూరు వ్యవహారంలో క్విడ్ ప్రోకో ఏమైనా జరిగిందా అనేది ఆరా తీస్తోంది. ఈ ప్రాథమిక విచారణలో భాగంగా సీబీఐ ఇప్పటికే పలువురు ఐసీఐసీఐ బ్యాంకు అధికారులను ప్రశ్నించడంతో పాటు ఆ రుణ లావాదేవీకి సంబంధించిన  పత్రాలను స్వాధీనం చేసుకుంది. రుణాన్ని పొందిన వీడియోకాన్ గ్రూపు అందుకు ప్రతిఫలంగా దీపక్ కొచ్చర్ ఆధీనంలోని నూపవర్ రెన్యువబుల్స్ అనే పవన విద్యుత్ సంస్థలో పెట్టుబడులు పెట్టిందనీ, వీడియోకాన్ గ్రూపునకు రుణాలను మంజూరు చేసిన కమిటీలో  చందా కొచ్చర్ ఉన్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు  క్విడ్ ప్రోకో జరగలేదంటూ ఈ ఆరోపణలను  వీడియోకాన్  చైర్మన్‌ ధూత్‌ తోసిపుచ్చిన సంగతి విదితమే..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top