కొచర్‌పై కొనసాగుతున్న ప్రశ్నల వర్షం 

Chanda Kochhar distances herself from husband Deepak business - Sakshi

అక్రమ ధనార్జన కేసులో నాల్గవరోజు ఈడీ చర్యలు

ముంబై: అక్రమ ధనార్జన కేసులో సోమవారం వరుసగా నాల్గవరోజూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఐసీఐసీఐ బ్యాంక్‌ చీఫ్‌ చందాకొచర్‌ను ప్రశ్నించారు.  చందా కొచర్, ఆమె భర్త దీపక్‌ కొచర్, వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నాలుగురోజులుగా దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీడియోకాన్‌కు చెందిన కొన్ని కార్యాలయాల్లో కూడా సోదాలు జరిగినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ముంబై, ఔరంగాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.1,875 కోట్ల రుణ మంజూరు విషయంలో తీవ్ర అవకతవకలు, అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఈడీ, ఈ అంశంలో తదుపరి విచారణను తీవ్రతరం చేసింది. 

మార్చి 1 నుంచీ... 
మార్చి 1న చందా కొచర్, ఆమె భర్త దీపక్‌ కొచర్‌లను సౌత్‌ ముంబైలోని వారి నివాసంలో ఈడీ అధికారులు మొదటిసారి ప్రశ్నించారు. సోమవా రం ఇక్కడి ఈడీ కార్యాలయంలో ఆమెను అధికారులు తాజాగా ప్రశ్నించారు. కాగా ఆదివారం ఈడీ అధికారులు మాటిక్స్‌ గ్రూప్‌ చైర్మన్, ఎస్సార్‌ గ్రూప్‌ సహ వ్యవస్థాపకులు రవి రుయా మేనల్లుడు నిషాంత్‌ కనోడియాను కూడా ప్రశ్నించారు. మారిషస్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయన ఫస్ట్‌లాండ్‌ హోల్డింగ్స్‌ దీపక్‌ కొచర్‌ నిర్వహిస్తున్న నూపవర్‌ రెన్యువబుల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు పెట్టారు. ఈ కేసులో వీడియోకాన్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ దూత్‌పై మార్చి 2న ఈడీ అధికారులు అర్ధరాత్రి వరకూ ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top