గ్రాముకు రూ. 3,119 ధర.. 

Center has decided to pay Rs 3119 per gram for the golden bonds - Sakshi

కొత్త సిరీస్‌ పసిడి బాండ్లకురేటు నిర్ణయం

ఈ నెల 24 నుంచి అమ్మకాలు  

న్యూఢిల్లీ: కొత్తగా జారీ చేసే పసిడి బాండ్ల సిరీస్‌కు సంబంధించి గ్రాముకు రూ.3,119 ధరను కేంద్రం నిర్ణయించింది. 2018–19 సావరీన్‌ గోల్డ్‌ బాండ్స్‌ స్కీమ్‌లో నాలుగో సిరీస్‌ కింద బాండ్ల జారీ డిసెంబర్‌ 24న ప్రారంభమై 28న ముగుస్తుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారికి, డిజిటల్‌ విధానంలో చెల్లింపులు జరిపేవారికి ఇష్యూ ధరలో గ్రాముపై రూ.50 డిస్కౌంట్‌ ఉంటుంది. ఈ కేటగిరీకి చెందిన వారికి గ్రాము ధర రూ.3,069గా ఉంటుందని పేర్కొంది. అక్టోబర్‌తో ప్రారంభమైన పసిడి బాండ్ల జారీ వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా ప్రతి నెలా ఉంటుంది. 
బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), పోస్టాఫీసులు, స్టాక్‌ ఎక్సే్చంజీల ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. భౌతిక రూపంలో బంగారానికి డిమాండ్‌ తగ్గించేందుకు, పసిడి కొనుగోళ్లకు వెచ్చిస్తున్న మొత్తాన్ని ఆర్థిక సాధనాల్లోకి మళ్లించేందుకు 2015 నవంబర్‌లో సావరీన్‌ గోల్డ్‌ బాండ్‌ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top