రాజీవ్‌ కొచర్‌ను విచారించిన సీబీఐ

CBI grills Rajiv Kochhar again on day 2  - Sakshi

తొమ్మిది గంటల పాటు ప్రశ్నల వర్షం

వీడియోకాన్‌ గ్రూపునకు అందించిన సేవలపై ఆరా

న్యూఢిల్లీ: వీడియోకాన్‌ గ్రూపునకు 2012లో ఐసీఐసీఐ బ్యాంకు జారీ చేసిన రూ.3,250 కోట్ల రుణానికి సంబంధించిన కేసులో బ్యాంకు సీఈవో చందా కొచర్‌ భర్త సోదరుడు రాజీవ్‌ కొచర్‌ను సీబీఐ శుక్రవారం విచారించింది. వీడియోకాన్‌ గ్రూపునకు రుణ పునరుద్ధరణకు సంబంధించి రాజీవ్‌ కొచర్‌ను సీబీఐ అధికారులు తొమ్మిది గంటల పాటు పలు కోణాల్లో ప్రశ్నించారు. రాజీవ్‌ కొచర్‌కు చెందిన అవిస్టా అడ్వైజరీ సర్వీసెస్‌ పేరుతో వీడియోకాన్‌ గ్రూపునకు అందించిన రుణ సలహా సేవలపై వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు.

విదేశానికి వెళ్లే ప్రయత్నంలో ఉన్న రాజీవ్‌ కొచర్‌ను సీబీఐ గురువారం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ను అధికారులు విచారించారు. ఈ విచారణ శుక్రవారం కూడా కొనసాగింది. వీడియోకాన్‌కు రుణం మంజూరు చేయడం ద్వారా బ్యాంకు సీఈవో చందాకొచర్‌కు పరోక్షంగా రూ.60 కోట్లకు పైగా లబ్ధి కలిగిందన్న ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. ఈ ఆరోపణల్లో నిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది.

విచారణలో ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని తేలితే అప్పుడు నిందితులపై కేసులు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపడుతుంది. రుణం మంజూరు తర్వాత వీడియోకాన్‌ గ్రూపు చైర్మన్‌ వేణుగోపాల్‌ ధూత్, చందాకొచర్‌ భర్త దీపక్‌ కొచర్‌ ఏర్పాటు చేసిన న్యూపవర్‌ రెన్యువబుల్స్‌కు నిధులు అందించినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే, చందాకొచర్‌పై వచ్చిన ఆరోపణలను ఐసీఐసీఐ బ్యాంకు యాజమాన్యం ఇప్పటికే ఖండించిన విషయం విదితమే.  

చందాకొచర్, ఆమె భర్త,ధూత్‌లపై లుకవుట్‌ నోటీసులు?
వీడియోకాన్‌–ఐసీఐసీఐ బ్యాంకు కేసు కొత్త మలుపు తీసుకుంది. వీడియోకాన్‌ గ్రూపునకు ఐసీఐసీఐ బ్యాంకు రుణం జారీ వెనుక అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన సీబీఐ, బ్యాంకు సీఈవో చందాకొచర్, ఆమె భర్త దీపక్‌కొచర్, వీడియోకాన్‌ గ్రూపు చైర్మన్‌ వేణుగోపాల్‌ ధూత్‌లపై లుకవుట్‌ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.

దేశం విడిచి వెళ్లిపోకుండా వారిని నిరోధించేందుకు గాను దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు లుకవుట్‌ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. దీనిపై సీబీఐ నుంచి అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top