థీమాటిక్‌ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చా?

Can You Choose Thematic Funds? - Sakshi

ఇటీవల సుందరమ్‌ రూరల్‌ ఫండ్‌ మంచి రాబడులను ఇచ్చింది. దీంతో పాటు నేను టాటా కన్సూమర్‌ ఫండ్‌లో కూడా ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఇలాంటి థీమాటిక్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌  చేయడం సరైనదేనా ? మరే ఇతర మ్యూచువల్‌ ఫండ్స్‌లో నేను ఇన్వెస్ట్‌ చేయడం లేదు.  
– కళ్యాణ్, విజయవాడ 

కేవలం థీమాటిక్‌ ఫండ్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్‌ చేయడం సరైనది కాదు.  రూరల్‌ ఇండియా ఫండ్‌ గత రెండు–మూడేళ్లలో మంచి రాబడులు ఇచ్చింది. గత రెండు–మూడేళ్లలో మంచి రాబడులు వచ్చాయి కదా అని ఇప్పుడు ఇన్వెస్ట్‌ చేస్తే, ఆ తర్వాత మీరు ఆశించిన రాబడులు రాకపోవచ్చు.. థీమాటిక్‌ ఫండ్స్‌ తీవ్రమైన ‘సైక్లికల్‌’ మార్పు, చేర్పులకు గురవుతాయి. అందుకని అవి ఇస్తే భారీ రాబడులనిస్తాయి. లేకుంటే తీవ్ర స్థాయి నష్టాలను ఇస్తాయి. ఈ తరహా ఫండ్స్‌ పనితీరును స్వల్పకాలమే మదింపు చేసి ఇన్వెస్టర్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అందుకనే థీమాటిక్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.  మీరు థీమాటిక్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారంటే దానర్థం ఒక తరహా కంపెనీ షేర్లలోనే ఇన్వెస్ట్‌ చేయమని మీరు మీ ఫండ్‌ మేనేజర్‌కు ఆదేశాలు ఇస్తున్నట్లు అర్థం. ఉదాహరణకు మీ థీమాటిక్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తీసుకుంటే, మీరు కన్సూమర్, రూరల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నారు. అంటే కన్సూమర్‌ సంబంధిత, రూరల్‌ సంబంధిత కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేయాలని మీరు మీ ఫండ్‌ మేనేజర్‌కు చెప్పినట్లు లెక్క. ఇలా చేస్తే డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలను మీరు పొందలేరు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడమంటే డైవర్సిఫికేషన్‌ కోసమే కదా ! మరో ముఖ్యమైన విషయం థీమాటిక్‌ ఫండ్స్‌లో ఎప్పుడు ఇన్వెస్ట్‌ చేయాలనేది కీలకమైన అంశం. సరైన సమయంలో ఈ థీమాటిక్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మీకు మంచి రాబడులు వస్తాయి. అలా కాకుంటే నష్టాలు తప్పవు. కానీ సరైన టైమింగ్‌ ఎప్పుడనేది మనం అంచనా వేయలేం. సంబంధిత రంగంపై మీకు పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే, ఈ రంగానికి సంబంధించిన ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. థీమాటిక్‌ ఫండ్స్‌పై మక్కువ ఎక్కువగా ఉండి, దాంట్లో ఇన్వెస్ట్‌ చేయాల్సిందేనన్న కోరిక బలీయంగా ఉన్నప్పుడు మీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 10 నుంచి 15 శాతం మాత్రమే ఈ ఫండ్స్‌కి కేటాయించాలి. దీని వల్ల మీ కోరికా తీరుతుంది. థీమాటిక్‌ ఫండ్స్‌ పనితీరూ అర్థమవుతుంది. అంతే కాకుంండా అది ఒక పాఠంలా కూడా ఉంటుంది. మీ పోర్ట్‌ఫోలియోలో తప్పనిసరిగా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉండాలి. ఈ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు
ఇన్వెస్ట్‌ చేస్తే, మంచి రాబడులు పొందే అవకాశాలు అధికంగా ఉంటాయి. 

నేను ఐసీఐసీఐ ఫోకస్‌డ్‌ బ్లూచిప్‌ ఈక్విటీ, హెచ్‌డీఎఫ్‌సీ యులిప్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఈ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా  15  సంవత్సరాల్లో రూ.20 లక్షల రాబడి పొందగలనా ? 
– సతీశ్, నెల్లూరు  

ఐసీఐసీఐ ఫోకస్‌డ్‌ బ్లూచిప్‌ ఈక్విటీ అనేది మంచి లార్జ్‌క్యాప్‌ ఫండ్‌. ఇక యులిప్‌ల విషయానికొస్తే, దీంట్లో కొంత భాగం బీమాకు కేటాయించి, మిగిలిన దానిని ఇన్వెస్ట్‌ చేస్తారు. ఫలితంగా మీకు తగిన బీమా కవరేజ్‌ ఉండదు. మంచి రాబడులూ రావు. ఇక మీరు 15 సంవత్సరాల్లో రూ.20 లక్షలు పొందాలనుకుంటున్నారు.  కాబట్టి లార్జ్‌క్యాప్‌ ఫండ్‌కు బదులు ఏదైనా మల్టీక్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. మల్టీ క్యాప్‌ ఫండ్‌ మేనేజర్లకు వివిధ పరిమాణాల కంపెనీల్లో(స్మాల్, మిడ్, లార్జ్‌ క్యాప్‌ కంపెనీల్లో) ఇన్వెస్ట్‌ చేసే వెసులుబాటు ఉంటుంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ యులిప్‌కు బదులుగా మీ బీమా అవసరాలకు తగ్గట్లుగా ఉండే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోండి. మీరు లేకపోయినా మీ కుటుంబ ఆర్థిక అవసరాలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా గడిచిపోయేందుకు అవసరమైన మొత్తానికి బీమా పాలసీని తీసుకోండి. టర్మ్‌ పాలసీల్లో బీమా కవరేజ్‌ ఎక్కువగానూ, చెల్లించాల్సిన బీమా ప్రీమియమ్‌ తక్కువగానూ ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ యూలిప్‌కు బదులుగా మరో మల్టీక్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి.  

నేను 2012 నుంచి ఎల్‌ఐసీ పెన్షన్‌ ప్లాన్‌లో ఏడాదికి రూ.70,000 చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఈ ప్లాన్‌లో ఎక్స్‌పెన్స్‌ చార్జీలు అధికంగా ఉన్నాయి. రాబడి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ ప్లాన్‌ నుంచి వైదొలగాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి ? 
– అప్జల్, హైదరాబాద్‌  

ఎల్‌ఐసీ పెన్షన్‌ ప్లాన్‌ మీకు కొంత బీమా కవరేజ్‌ను ఇస్తుంది. మీరు ఇన్వెస్ట్‌ చేసే కొంత మొత్తంలో రిటైర్మెంట్‌ ఫండ్‌కోసం ఇన్వెస్ట్‌ చేస్తుంది. కానీ ఇలాంటి హైబ్రిడ్‌ ప్లాన్‌లు సమర్థవంతమైన రాబడులను ఇవ్వలేవు. ఇవి తగిన బీమా రక్షణ కూడా ఇవ్వలేవు. అందుకని ఈ తరహా ప్లాన్‌ల నుంచి వైదొలగడమే శ్రేయస్కరం. కంపెనీ సంబంధిత వ్యక్తులను సంప్రదించి సరెండర్‌ ఆప్షన్స్‌ వివరాలను తెలుసుకోండి. బీమా, ఇన్వెస్ట్‌మెంట్‌ కలగలసిన ప్లాన్‌ల్లో ఎప్పుడూ ఇన్వెస్ట్‌ చేయకూడదు. జీవిత బీమా కోసం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవడమే సరైన నిర్ణయం. ఇక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం పూర్తిగా మదుపు సంబంధిత సాధనాలు.. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడమే సరైన విధానం. పన్ను ప్రయోజనాలు కావాలనుకుంటే, ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)ల్లో ఇన్వెస్ట్‌ చేయాలి. ప్రభుత్వం నిర్వహించే రిటైర్‌మెంట్‌ ప్లాన్‌ కావాలనుకుంటే, నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌)ను పరిశీలించవచ్చు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, అదనంగా కొంత పన్ను ప్రయోజనాలు పొందవచ్చు కూడా. 
- ధీరేంద్ర కుమార్‌
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top