ఆర్‌బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు

Cabinet approves ordinance to bring cooperative banks under RBI - Sakshi

పీఎంఎంవై శిశు రుణాలపై 2% వడ్డీ రాయితీ

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ: సహకార బ్యాంకుల్లో పాలన మెరుగుపడనుంది. డిపాజిట్‌దారుల ప్రయోజనాలకు రక్షణ లభించనుంది. ఇందుకుగాను అన్ని పట్టణ, బహుళ రాష్ట్రాల్లో పనిచేసే సహకార బ్యాంకులను ఆర్‌బీఐ పర్యవేక్షణ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు, పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) వైఫల్యం తరహా సంక్షోభాలకు చోటివ్వకుండా ఈ నిర్ణయానికి వచ్చింది.

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కేబినెట్‌ భేటీ అనంతరం మీడియాకు వివరాలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా వాణిజ్య బ్యాంకుల మాదిరే ఇకమీదట ఆర్‌బీఐ పర్యవేక్షణ కిందకు 1,540 పట్టణ కోపరేటివ్, మల్టీ స్టేట్‌ కోపరేటివ్‌ (ఒకటికి మించి రాష్ట్రాల్లో పనిచేసేవి) బ్యాంకులు రానున్నట్టు మంత్రి చెప్పారు.

దేశవ్యాప్తంగా 1,482 అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకులు, 58 మల్టీస్టేట్‌ కోపరేటివ్‌ బ్యాంకులు పనిచేస్తుండగా.. వీటి పరిధిలో 8.6 కోట్ల డిపాజిటర్లకు సంబంధించి రూ. 4.85 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. పీఎంసీ బ్యాంకులో రుణాల స్కామ్‌ వెలుగు చూడడంతో ఆర్‌బీఐ 2019 సెప్టెంబర్‌ 23న నిషేధం విధించడం తెలిసిందే. దీంతో డిపాజిట్ల ఉపసంహరణపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అదే విధంగా కాన్పూర్‌కు చెందిన పీపుల్స్‌ కోపరేటివ్‌ బ్యాంకు డిపాజిట్ల ఉపసంహరణపైనా ఆంక్షలు విధిస్తూ ఆర్‌బీఐ ఈ నెల మొదట్లో నిర్ణయం తీసుకోవడం గమనార్హం.   

చిన్న రుణాలపై తగ్గనున్న వడ్డీ భారం
ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం (పీఎంఎంవై) కింద శిశు రుణ ఖాతాలపై 2% వడ్డీ రాయితీ ఇచ్చే పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది . లాక్‌డౌన్‌తో సమస్యలను ఎదుర్కొంటున్న చిన్న వ్యాపారస్తులకు ఈ నిర్ణయం మేలు చేయనుంది. ముద్రా యోజన పథకం కింద శిశు రుణాల విభాగంలో ఎటువంటి పూచీకత్తు లేని రుణాలను రూ.50,000 వరకు బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. ఈ రుణాలు తీసుకున్న వారికి వడ్డీలో 2% మేర ఏడాది వరకు రాయితీ లభించనుందని.. దీని కారణంగా ప్రభుత్వ ఖజానాపై రూ.1,542 కోట్ల భారం పడుతుందని జవదేకర్‌ తెలిపారు.

2020 మార్చి నాటికి బకాయిలు చెల్లించాల్సి, నిరర్థక ఆస్తుల(ఎన్‌పీఏలు) జాబితాలో లేని రుణ ఖాతాలకు ఇది అమలుకానుంది. ఈ పథకం ఈ ఏడాది జూన్‌ 1 నుంచి వచ్చే ఏడాది మే 31 వరకు అమల్లో ఉంటుంది. ఆర్‌బీఐ  మారటోరియం (రుణ చెల్లింపుల విరామం) కింద ఉన్న ఖాతాలకు.. మారటోరియం నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి 12 నెలల పాటు (2020 సెప్టెంబర్‌ 1 నుంచి 2021 ఆగస్ట్‌ 31 వరకు) వడ్డీ రాయితీ లభిస్తుంది.  2020 మార్చి నాటికి పీఎంఎంవై çపరిధిలోని శిశు విభాగంలో రూ.9.37 కోట్ల రుణ ఖాతాలున్నాయి. దీని కింద విడుదల చేసిన రుణాల మొత్తం రూ.1.62 లక్షల కోట్లుగా ఉంది.

రూ. 15 వేల కోట్లతో ‘పశుసంవర్ధక మౌలిక’ నిధి
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ప్రకటించిన ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ఉద్దీపన ప్యాకేజీని అనుసరించి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ రూ. 15,000 కోట్లతో పశుసంవర్థక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఏహెచ్‌ఐడీఎఫ్‌)కి బుధవారం ఆమోదం తెలిపింది. పాడి, మాంసం ప్రాసెసింగ్, విలువ పెంచే మౌలిక సదుపాయాల కల్పన, ప్రైవేటు రంగంలో పశుగ్రాస కర్మాగారాల స్థాపన వంటి మౌలిక సదుపాయాల స్థాపనలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఏహెచ్‌ఐడీఎఫ్‌ వీలు కల్పిస్తుంది.

ఈ పథకం కింద అర్హత పొందిన లబ్ధిదారులు రైతు ఉత్పత్తి సంస్థ(ఎఫ్‌పీవో)లు, ఎంఎస్‌ఎంఈలు, సెక్షన్‌ 8 కంపెనీలు, ప్రైవేట్‌ కంపెనీలు, వ్యక్తులు కనీసం 10% మార్జిన్‌ మనీతో పెట్టుబడి పెడితే మిగిలిన 90% షెడ్యూల్డ్‌ బ్యాంకులు రుణాలు ఇస్తాయి. అర్హతగల లబ్ధిదారులకు భారత ప్రభుత్వం 3% వడ్డీ రాయితీని కల్పిస్తుంది. ప్రధాన రుణ మొత్తానికి 2 సంవత్సరాల మారటోరియం ఉంటుంది. నాబార్డ్‌ నిర్వహించేలా రూ. 750 కోట్లతో మరొక క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌ను  కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎంఎస్‌ఎంఈ పరిధిలో మంజూరైన ప్రాజెక్టులకు క్రెడిట్‌ గ్యారంటీ కోసం ఈ నిధిని ఉపయోగిస్తారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top