బుల్‌ రన్‌ తొలి దశలో: జున్‌జున్‌వాలా | Bull run first phase: Rakesh Jhunjhunwala | Sakshi
Sakshi News home page

బుల్‌ రన్‌ తొలి దశలో: జున్‌జున్‌వాలా

Jun 8 2020 11:44 AM | Updated on Jun 8 2020 11:51 AM

Bull run first phase: Rakesh Jhunjhunwala - Sakshi

దేశీయంగా స్టాక్‌ మార్కెట్లు అతిపెద్ద బుల్‌ రన్‌ ప్రారంభ దశలో ఉన్నట్లు సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ రాకేష్‌ జున్‌జున్‌వాలా పేర్కొంటున్నారు. కోవిడ్‌-19 కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్‌ను పూర్తిగా ఎత్తివేశాక కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టే వీలున్నట్లు ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. మార్కెట్ల తీరు, పెట్టుబడి అవకాశాలు తదితర అంశాలపై రాకేష్‌ అభిప్రాయాలను చూద్దాం..

టెస్ట్‌ మ్యాచ్‌
బుల్‌ మార్కెట్‌ అంటే క్రికెట్లో టెస్ట్‌ మ్యాచ్‌వంటిదని చెప్పవచ్చు. ఇది 50 ఓవర్లలో ముగిసే గేమ్‌ కాదు. అయితే బుల్‌ ట్రెండ్‌ మొదలయ్యేముందు మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కోవడం సాధారణం. కొత్తగా మొదలయ్యే ప్రతీ బుల్‌ మార్కెట్‌ గతంలో నమోదైన బుల్‌ ట్రెండ్‌కంటే ప్రభావవంతంగా ఉంటుంది. కోవిడ్‌-19 మహమ్మారి విజృంభణతో మార్చిలో వెల్లువెత్తిన భారీ అమ్మకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో ఇక్కడినుంచి దేశీ మార్కెట్లు కన్సాలిడేట్‌ అయ్యే వీలుంది. పరిస్థితులు వేగంగా సాధారణ స్థితికి చేరుకోనున్న సంకేతాలను ఇటీవల మార్కెట్లలో కనిపిస్తున్న ర్యాలీ ప్రతిబింబిస్తోంది. లాక్‌డవున్‌ను పూర్తిగా ఎత్తివేశాక ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా వ్యయప్రణాళికలు అమలు చేసే అవకాశముంది. 

రిస్క్‌ తక్కువే
ప్రస్తుత స్థాయిల నుంచి మార్కెట్లు భారీగా పతనంకాకపోవచ్చు. ఇప్పటికే ప్రారంభమై బుల్‌ మార్కెట్‌ నేపథ్యంలో కంపెనీల ఈపీఎస్‌లు, పీఈ రేషియోలు విస్తరించే వీలుంది. గత మూడు నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లూ సమస్యలు ఎదుర్కొన్నాయి. అనవసర భయాల కారణంగా కోవిడ్‌-19 సంక్షోభం అధికమైనట్లు తోస్తోంది. ఇది ఒక ఫ్లూ వ్యాధి మాత్రమే. ప్లేగు లేదా క్యాన్సర్‌కాదు. దీర్ఘకాలంలో కోవిడ్‌-19 కారణంగా పెను మార్పులు కనిపించకపోవచ్చు. ప్రజలు తిరిగి ప్రయాణాలు చేయడం, రెస్టారెంట్లను సందర్శించడంవంటివి చేపడతారని చెప్పవచ్చు. కోవిడ్‌-19 కారణంగా ఏర్పడిన నష్టాలపై ఒక అవగాహనకు రావడం ద్వారా ప్రభుత్వం తదుపరి దశలో తగిన చర్యలు చేపట్టే వీలుంది. కోవిడ్‌-19 సవాళ్ల తదుపరి పలు కంపెనీలు యథాప్రకారం కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. కొన్ని కంపెనీలు వేగవంత వృద్ధిని అందుకోవచ్చు. మరికొన్ని కంపెనీలు సవాళ్లను అధిగమించడంలో మరికొంత శ్రమించవలసిరావచ్చు. 

అనిశ్చితి
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇటీవల బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో అమ్మకాలు తలెత్తాయి. డిసెంబర్‌ తదుపరి మాత్రమే బ్యాంకింగ్‌ వ్యవస్థలో మొండిబకాయిల(ఎన్‌పీఏలు) సమస్యల వివరాలు వెల్లడయ్యే వీలుంది. దీంతో ఫైనాన్షియల్‌ రంగ కౌంటర్లు అంతంత మాత్ర పనితీరునే చూపవచ్చు. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో కన్సాలిడేషన్‌కు దారి ఏర్పడవచ్చు. అయితే హౌసింగ్‌ రంగానికి భారీ సమస్యలు ఎదురుకాకపోవచ్చని అంచనా. పలు సంస్థలు దివాళా బాట పట్టడం ద్వారా ఫైనాన్షియల్‌ రంగంలో సమస్యలు పెరగనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. నిజానికి ఇతర సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ కస్టమర్లు అతితక్కువగా రుణ చెల్లింపుల వాయిదాల మారటోరియంవైపు మొగ్గు చూపడం గమనించదగ్గ అంశం!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement