వాట్సాప్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌ పోటీ!

BSNL Competition With Whatsapp in Video Calls - Sakshi

వైఫైతో కాల్స్‌ చేసుకునే సదుపాయం

ప్రస్తుతం ప్రయోగదశలో వీవోవైఫై  

ముందుగా ద్వితీయ శ్రేణి నగరాల్లో ప్రారంభం

ముంబై: ప్రైవేట్‌ టెల్కోల రాకతో వెనుకబడిన ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) జోరు పెంచుతోంది. తాజాగా వాట్సాప్‌ వంటి ఓవర్‌–ది–టాప్‌ (ఓటీటీ) సంస్థలతో పోటీపడేందుకు సిద్ధమవుతోంది. వైఫై ఇంటర్నెట్‌ ద్వారా కాల్స్‌ చేయడం, రిసీవ్‌ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టే యత్నాల్లో ఉంది. ఇందుకు సంబంధించిన అడ్వాన్స్‌డ్‌ వాయిస్‌ ఓవర్‌ వైఫై (వీవోవైఫై) సర్వీసులను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. అత్యుత్తమ టెక్నాలజీతో అత్యంత నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంపిక చేసిన కొన్ని సర్కిల్స్‌లో ప్రస్తుతం వీటిని పరీక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా అన్ని సర్కిల్స్‌లోనూ ఈ సేవలు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నా.. ముందుగా మాత్రం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, స్పెక్ట్రం అంతగా అందుబాటులో ఉండని మారుమూల ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి తేవాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ యోచిస్తోంది. 

ప్రత్యర్థి సంస్థలతోనూ పోటీ..
ప్రస్తుతం ప్రైవేట్‌ టెల్కోలైన భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ (ఆర్‌జియో) తదితర సంస్థలు కూడా వీవోవైఫై సర్వీసులను పరీక్షిస్తున్నా యి. ఇవి తుది దశలో ఉండగా త్వరలోనే సేవలు అందుబాటులోకి తేవాలని ఆయా సంస్థలు యోచి స్తున్నాయి. అయితే, వాటికన్నా ముందే రంగంలోకి దిగాలని, మార్కెట్‌ను దక్కించుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ చకచకా పావులు కదుపుతోంది. 

బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌లో మార్పులు..
రిలయన్స్‌ జియో కొత్తగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ విభాగంలో ముందే పట్టు సాధించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనిలోభాగంగా భారత్‌ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌ చార్జీలను సవరించింది. నెలకు 500 జీబీ డేటా ఆఫర్‌ చేసే రూ. 777 ప్లాన్‌ను సవరించి రూ. 849కి మార్చింది. దీని కింద 50 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో డేటాను 600 జీబీకి పెంచింది. అలాగే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ కూడా అందిస్తోంది. మరోవైపు, రోజుకు 50 జీబీ డేటా అందించే రూ. 3,999 ప్లాన్‌ని కూడా సవరించి రూ. 4,499కి మార్చింది. ఈ ప్లాన్‌ కింద ఇకపై 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో రోజూ 55 జీబీ డేటా లభిస్తుంది.

వీవోవైఫై అంటే ..
మొబైల్‌ సిగ్నల్‌ లేకపోయినా యూజర్లకు కనెక్టివిటీ దెబ్బతినకుండా చూసే అత్యుత్తమ టెక్నాలజీగా వీవోవైఫైకి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ (వైఫై) ద్వారా కాల్స్‌ చేయడం, రిసీవ్‌ చేసుకోవడాన్ని సాధారణంగా వైఫై కాలింగ్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం వాట్సాప్, స్కైప్, హైక్, ఫేస్‌బుక్, గూగుల్‌ వంటి ఓటీటీ సంస్థలు ఈ తరహా సేవలు అందిస్తున్నాయి. అయితే, టెల్కోల్లాగా లైసెన్సు బాదరబందీ లేని ఈ సంస్థలు తమ వాయిస్‌ సేవల విభాగం ఆదాయానికి గండి కొడుతున్నాయంటూ టెలికం సంస్థలు చాన్నాళ్లుగా గగ్గోలు పెడుతున్నాయి. ఓటీటీ సంస్థలు కూడా తమలాగా కాలింగ్, మెసేజింగ్‌ సర్వీసులను అందిస్తున్నాయి కాబట్టి వాటిని సైతం లైసెన్సింగ్‌ పరిధిలోకి తీసుకురావాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top