బోగస్‌ రిఫండ్‌ క్లెయిమ్‌ల రాకెట్‌ రట్టు

బెంగళూరులో గుర్తించిన ఆదాయపన్ను శాఖ

ప్రముఖ కంపెనీల ఉద్యోగులు, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ పాత్ర  

న్యూఢిల్లీ: బోగస్‌ క్లెయిమ్‌లతో పన్ను రిఫండ్‌లు పొందుతూ ఆదాయపన్ను శాఖను మోసం చేస్తున్న ఓ రాకెట్‌ను ఆ శాఖాధికారులు ఎట్టకేలకు ఛేదించారు. ఐబీఎం, ఇన్ఫోసిస్, వొడాఫోన్‌ తదితర బడా కంపెనీల ఉద్యోగులు సైతం ఇందులో పాత్రధారులు కావటం గమనార్హం. ఓ చార్టర్డ్‌ అకౌంటెంట్‌తో కలసి ఉద్యోగులు ఈ పనికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో సదరు చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ) నివాసంపై బుధవారం ఆదాయపన్ను శాఖ పరిశోధన విభాగం అధికారులు సోదాలు నిర్వహించగా, పలు క్లయింట్లకు సంబంధించి బోగస్‌ క్లెయిమ్‌ల పత్రాలు, వారి మధ్య నడిచిన వాట్సాప్‌ సంభాషణల ఆధారాలు లభించాయి.

సదరు సీఏ తప్పుడు ఆదాయ పన్ను రిటర్నులు వేయడంతోపాటు, తిరిగి మోసపూరితంగా రిఫండ్‌ క్లెయిమ్‌లను చేసేందుకు ఓ ఉపకరణంగా పనిచేస్తున్నట్టు ఆదాయపన్ను శాఖ తెలిపింది. ఇంటిపై నష్టం వచ్చిందని పేర్కొంటూ సీఏ ఇప్పటి వరకు 1,000 రిటర్నులను దాఖలు చేసినట్టు, ఈ నష్టం రూ.18 కోట్లుగా చూపించినట్టు పేర్కొంది. సీఏకి క్లయింట్లుగా ఉన్న 50 ప్రముఖ కంపెనీల ఉద్యోగులను విచారించే పనిలో ఉన్నట్టు తెలిపింది.

‘‘పేరున్న కంపెనీలు ఐబీఎం, వొడాఫోన్, ఎస్‌ఏపీ ల్యాబ్స్, బయోకాన్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, సిస్కో, థామ్సన్‌ రాయిటర్స్‌ ఇండియా తదితర కంపెనీల ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆదాయానికి సంబంధించి సవరణ రిటర్నులు దాఖలు చేయడం ద్వారా మోసపూరిత క్లెయిమ్‌లకు పాల్పడ్డారు’’ అని ఆదాయపన్ను శాఖ తన ప్రకటనలో వివరించింది. వీరిలో చాలా మందిని బుధవారం నుంచి విచారించామని, ఇంటిపై ఆదాయం విషయంలో వారికి నిజంగా ఎటువంటి నష్టం కలగలేదని గుర్తించినట్టు స్పష్టం చేసింది.

విచారణలో భాగంగా ఉద్యోగులు నెపాన్ని సీఏపై మోపారు. తమ తరఫున రిఫండ్‌లను తెచ్చిపెడతానని సీఏ చెప్పినట్టు వెల్లడించారు. 10 శాతం చార్జీలను వసూలు చేసినట్టు వాట్సాప్‌ ఆధారాలను కూడా కొందరు చూపించారు. అయితే, క్లయింట్ల బలవంతంతోనే తానీ క్లెయిమ్‌లు చేసినట్ట సీఏ చెప్పడం ఆశ్చర్యకరం. విచారణ ఇంకా కొనసాగుతోందని, తప్పుడు క్లెయిమ్‌లు చేసిన సీఏ, ఉద్యోగులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆదాయపన్ను శాఖ ప్రకటించింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top