ఆ నిధిని బ్యాంకులకిస్తే బెటర్‌

BOA React on RBI Funds - Sakshi

ఆర్‌బీఐ అదనపు నిధులపై బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అభిప్రాయం

కేంద్రానికి రూ.3 లక్షల కోట్లు బదలాయించవచ్చని అంచనా

ఈ మేరకు జలాన్‌ కమిటీ సిఫారసు ఉంటుందని నివేదిక  

న్యూఢిల్లీ: భారత్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద ఉన్న అదనపు నిధులను ‘మూలధనం కొరత ఇబ్బందుల్లో ఉన్న’ ప్రభుత్వ రంగ బ్యాంకులకు అందించేలా చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణా దిగ్గజ సంస్థ– బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా– మెరిలించ్‌ (బీఓఏ–ఎంఎల్‌) అభిప్రాయపడింది. ఆర్‌బీఐ వద్ద ఉన్న అదనపు నిధులను ప్రభుత్వానికి బదలాయించే అంశంపై సిఫారసులకు గత ఏడాది డిసెంబర్‌లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తన నివేదికను ఈ నెల్లో ఆర్‌బీఐకి సమర్పించనుంది. ఆర్‌బీఐ వద్ద ఉన్న నిధుల్లో మూడు లక్షల కోట్లను కేంద్రానికి బదలాయించవచ్చని ఈ కమిటీ సిఫారసు చేసే అవకాశం ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిలించ్‌ తాజా నివేదిక అంచనా వేసింది. అయితే ఈ నిధిని మూలధనం సమస్యతో ఇబ్బంది పడుతున్న బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్‌గా అందిస్తే ప్రయోజనం ఉంటుందని పేర్కొంది. ఇలాంటి నిర్ణయం ఆర్థిక రికవరీకీ దోహదపడుతుందని తెలిపింది. ద్రవ్యలోటు, లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) నిర్వహణ వంటి కీలక అంశాలకు కూడా ఆర్‌బీఐ నిధుల బదలాయింపు దోహదపడుతుందని పేర్కొంది. 

ఆర్‌బీఐ నిధులపై ఆధారపడక తప్పదా?
కేంద్రం ఎదుర్కొనే ద్రవ్యలోటును ఎలా పూడ్చుకోవాలన్న అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ నెలకొంది.  ద్రవ్యలోటు సమస్యను అధిగమించేందుకు ఆర్‌బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్‌బీఐ వద్ద జూన్‌ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్‌ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్‌ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో– డిసెంబర్‌ 10వ తేదీన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ప్రకటించారు. ఈ నిధుల నిర్వహణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకుముందు నవంబర్‌ 19న జరిగిన ఆర్‌బీఐ బోర్డ్‌ సమావేశం నిర్ణయించింది. శక్తికాంత దాస్‌ గవర్నర్‌ అయ్యాక డిసెంబర్‌లో జలాన్‌ నేతృత్వంలో ‘నిధుల బదలాయింపుపై’ కమిటీ కూడా ఏర్పాటయ్యింది. త్వరలో ఈ కమిటీ నివేదిక సమర్పించే అవకాశం ఉందని గత పాలసీ విధాన సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ పేర్కొంది.

ఇప్పటికేమూడు కమిటీలు...
గతంలోనూ ఆర్‌బీఐ నిల్వలపై మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్‌ (2004), వైహెచ్‌ మాలేగామ్‌ (2013) ఈ కమిటీలకు నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12 శాతం వరకూ ఆర్‌బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, ఉఫా థోరట్‌ కమిటీ దీనిని 18 శాతంగా పేర్కొంది. ఆర్‌బీఐ థోరట్‌ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారుల మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్‌ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28 శాతం నిష్పత్తిలో ఆర్‌బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14 శాతం నిధులు సరిపోతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top