కోటీశ్వరులు పెరుగుతున్నారు!

Billionaires are rising in this year - Sakshi

2015–16లో 59,830 మంది వెలుగులోకి 

కోటికిపైగా ఆదాయం ఉందంటూ ఐటీ రిటర్నులు 

వెల్లడించిన ఆదాయపన్ను శాఖ 

వీరి ఉమ్మడి ఆదాయం రూ.1.54 లక్షల కోట్లు 

న్యూఢిల్లీ: దేశంలో వ్యక్తిగత ఆదాయం రూ.కోటికి పైగా ఉన్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో తమకు మొత్తం మీద రూ.కోటి, అంతకు మించి ఆదాయం ఉందంటూ 59,830 మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. వీరు ప్రకటించిన ఉమ్మడి ఆదాయం రూ.1.54 లక్షల కోట్లు. ఆదాయపన్ను శాఖ ఈ గణాంకాలను బుధవారం విడుదల చేసింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.కోటికిపైగా ఆదాయం ఉందంటూ రిటర్నులు వేసిన వ్యక్తుల సంఖ్య 48,417 కాగా, వీరి ఉమ్మడి ఆదాయం రూ.2.05 లక్షల కోట్లు కావడం గమనార్హం. అంటే ఏడాది తిరిగేసరికి ఆదాయ లెక్కలు చూపించిన కోటీశ్వరుల సంఖ్య పెరగ్గా, వీరి ఉమ్మడి ఆదాయం మాత్రం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. 

2015–16  
►దేశంలో 120 కోట్ల జనాభాకు గాను 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య కేవలం 4.07 కోట్లు. వీరిలో 82 లక్షల మంది తమ ఆదాయం రూ.2.5 లక్షల్లోపు ఉందని లేదా సున్నా ఆదాయమని చూపించినవారే. ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల మేరకు వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలపై ఎటువంటి పన్ను లేని విషయం తెలిసిందే.  
►2015–16 ఆర్థిక సంవత్సరంలో రిటర్నులు దాఖలు చేసిన వ్యక్తుల ఉమ్మడి ఆదాయం రూ.21.27 లక్షల కోట్లు. ఇది అంతకుముందు ఏడాది రూ.18.41 లక్షల కోట్లుగా ఉంది.  
► రూ.2.5 – 3.5 లక్షల్లోపు ఆదాయం చూపించిన వారి సంఖ్య 1.33 కోట్లుగా ఉంది.  
►రూ.1–5 కోట్ల మధ్య ఆదాయం కలిగిన వారు 55,331 మంది ఉన్నారు. 
►రూ.5 – 10 కోట్ల మధ్య ఆదాయం ఉన్న వారు కేవలం 3,020 మందే.  
►రూ.10 – 25 కోట్ల మధ్య ఆదాయవంతులు 1,156 మంది. 
►ఇదే ఆర్థిక సంవత్సరంలో రూ.500కోట్లకు పైగా వార్షిక స్థూల ఆదాయం కలిగిన వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఆ వ్యక్తి చూపించిన ఆదాయం రూ.721 కోట్లు.  
►రూ.100 – 500 కోట్ల మధ్య ఆదాయం ఉన్న వారు 31 మంది కాగా, వీరి ఉమ్మడి ఆదాయం రూ.4,175 కోట్లు. 
►2015–16లో వ్యక్తులు, సంస్థలు సహా అన్ని రకాల పన్ను రిటర్నులు కలిపి 4.35 కోట్లుగా ఉన్నాయి. ప్రకటించిన మొత్తం ఆదాయం రూ.33.62 లక్షల కోట్లు. 
2014–15 
► 2014–15 ఆర్థిక సంవత్సరంలో రిటర్నులు దాఖలు చేసిన వ్యక్తులు 3.65 కోట్ల మంది కాగా, వీరిలో 1.37 కోట్ల మంది పన్ను చెల్లించే ఆదాయం లేదని తెలిపిన వారే.  
►  రూ.500కోట్లకు పైగా ఆదాయం కలిగిన వారు ఎనిమిది మంది ఉండగా. వీరి ఉమ్మడి ఆదాయం రూ.85,183 కోట్లు.  
► రూ.100–500 కోట్ల మధ్య ఆదాయం కలిగిన వారి సంఖ్య 17 మంది ఉండగా, వీరి ఉమ్మడి ఆదాయం రూ.2,761 కోట్లు.  
►2014–15లో అన్ని రకాల రిటర్నులు కలిపి చూస్తే 3.91 కోట్లు కాగా, ప్రకటించిన ఉమ్మడి ఆదాయం రూ.26.93 లక్షల కోట్లు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top