అయోధ్య తీర్పు : దలాల్‌ స్ట్రీట్‌లో ఇక మెరుపులే

Ayodhya verdict big positive for market, economy, say Dalal Street veterans - Sakshi

సాక్షి,ముంబై:  వివాదాస్పద అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు శనివారం వెలువరించిన తీర్పుపై సర్వత్రా ఆమోదం లభించింది. దీనిపై దలాల్‌ స్ట్రీట్‌ నిపుణులు  కూడా పాజిటివ్‌గా స్పందించారు. సుమారుగా వందేళ్ల నుంచి నలుగుతున్న వివాదం కొలిక్కి రావడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్లకు మంచిదని  మార్కెట్‌ పండితులు, ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పుతో దేశంలోని ప్రధాన రాజకీయ, విధాన పరమైన అనిశ్చితి ముగిసిందని అన్నారు. దీంతో ఇండియాపై విదేశీ ఇన్వెస్టర్ల నమ్మకం బలపడుతుందని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని అంచనావేస్తున్నారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని  అభిప్రాయపడ్డారు. ఇప్పటికే  స్టాక్‌మార్కెట్‌లో  కీలక సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ  రెండూ  కొత్త గరిష్టాల వద్ద కొనసాగుతున్నాయి. తాజా పరిణామాలతో  ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ మరింత బలపడి, కొనుగోళ్లతో దలాల్‌ స్ట్రీట్‌ మరింత  దూసుకుపోనుందని భావిస్తున్నారు.  
 
దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్తర ప్రదేశ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. దేశం 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే, ఖచ్చితంగా ఉత్తర ప్రదేశ్‌ వాటా లక్ష కోట్ల డాలర్లుగా ఉండాలి’ అని సీనియర్‌ ఇన్వెస్టర్‌ విజయ్‌ కేడియా అభిప్రాయపడ్డారు. వ్యవస్థను సరళతరం చేసే ఎటువంటి నిర్ణయమైనా, ఇండియాపై విదేశీ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచుతుంది’ అని కేఆర్‌ చోక్సి ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌, ఎండీ దివాన్‌ చోక్సి అన్నారు. ‘మొదట కశ్మీర్‌ 370 ఆర్టికల్‌ తొలగింపు,  అనంతరం అయోధ్యం తీర్పు దేశీయ వ్యవస్థకు మంచిదనీ, ఎల్‌టీసీజీ, వ్యక్తిగత పన్ను రేట్లను మార్చడం వంటి సంస్కరణలు మరిన్ని వస్తాయని సంజయ్‌ భాసిన్‌ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మార్కెట్‌పై బుల్లిష్‌గా ఉన్నానని, బెంచ్‌ మార్క్‌ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరడం ఇక సులభమని తెలిపారు. ఈ తీర్పు వలన అయోధ్యను సందర్శించి దేశీయ, విదేశీ టూరిస్ట్‌లు రోజుకు 50,000 నుంచి 1 లక్షకు చేరుకుంటారని కేడియా అన్నారు. ‘ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను మార్చిన వైష్ణోదేవి, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లానే అయోధ్య కూడా మారుతుంది’ అని అభిప్రాయపడ్డారు. కాగా అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు మొత్తం 2.77 ఎకరాల భూమిని రామమందిరం నిర్మణానికే కేటాయించాలని, మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని  తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top