అధిక వాహన ఉత్పత్తే అసలు సమస్య: రాహుల్‌ బజాజ్‌

Auto Crisis Due to Overproduction By Players Says Rahul Bajaj  - Sakshi

ముంబై: దేశీయ ఆటో రంగంలో ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం ‘‘అధిక ఉత్పత్తి అలాగే అధికంగా స్టాకులు పేరుకుపోవడం’’ అని బజాజ్‌ ఆటో ఎండీ రాహుల్‌ బజాజ్‌ అభిప్రాయపడ్డారు. సంక్షోభానికి ఆర్థిక మందగమన ప్రభావం చాలా స్వల్పమన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీఎస్‌టీ కోతలు అవసరం లేదన్నారు. ఇటీవల కాలంలో ఆటోమొబైల్‌ రంగంపై జీఎస్‌టీ తగ్గించాలని డిమాండ్‌ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నెల 20న జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో కోత విషయమై నిర్ణయం ఉండొచ్చని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఆటో ఇండస్ట్రీ భారత్‌ 6 నిబంధనలకు అనుగుణంగా మార్పు చెందుతోందని, నవంబర్‌ నాటికి పరిస్థితులు చక్కబడవచ్చని అంచనా వేశారు.

కరెక్షన్‌ లేకుండా ముందుకే సాగిపోయే పరిశ్రమ ఏదీ ఉండదని ఆయన చెప్పారు. ప్రస్తుతం కంపెనీలన్నీ దాదాపు అంతర్జాతీయ స్థాయిలో విక్రయాలు జరుపుతున్నందున, ఏదో ఒక దేశంలో మందగమనం మొత్తం కంపెనీపై ప్రభావం చూపే స్థితిలేదన్నారు. ఆటో విక్రయాల క్షీణతతో కేవలం 5– 7 శాతం మాత్రమే మందగమన ప్రభావంతో తగ్గి ఉంటాయన్నారు. ప్రతి పరిశ్రమకు ఉత్థానపతనాలు ఉంటాయని, సైకిల్స్‌ మారేందుకు సమయం పడుతుంటుందని వివరించారు. ఇప్పటి సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేరని, కానీ ఇప్పటికైతే జీఎస్‌టీ కోతల అవసరం లేదని అభిప్రాయపడ్డారు.  

స్వీయతప్పిదమే: నిజానికి ఆటో రంగంలో ఈ పరిస్థితికి కంపెనీలే ప్రధానకారణమని రాహుల్‌ విమర్శించారు. కంపెనీలు వృద్ధి అంచనాలు విపరీతంగా వేసుకొని అధిక ఉత్పత్తులు చేశాయన్నారు. లాజిక్‌ లేకుండా కంపెనీలు తీసుకున్న నిర్ణయాల ఫలితమే ఈ సంక్షోభమని దుయ్యబట్టారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top