
ఇండియన్ ఆటోమొబైల్ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. వాహన ఉత్పత్తిలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న భారత్ మరింత ముందుకు దూసుకెళ్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెబుతూనే ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేయడానికి సన్నాహాలు చేస్తోందని, దీనిని పరిశ్రమకు "కొత్త విజయగాథ" అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు.
భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతి అంశంపై.. ప్రభుత్వం మొదటిసారిగా ఒక సంఖ్యను నిర్ణయించింది. దేశీయ వాహన తయారీదారులు తమ ప్రపంచ వ్యూహాలను వేగవంతం చేస్తున్న సమయంలో ఈ ప్రకటన వెలువడింది. దేశ ఆర్ధిక వ్యవస్థకు.. ఆటోమొబైల్ రంగం కీలకంగా ఉంది. దీనిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
దశాబ్ద కాలంలో.. భారతదేశ ఆటో ఎగుమతులు బాగా పెరిగాయి. 2014లో దీని విలువ రూ. 50,000 కోట్లు ఉండగా.. నేడు ఇది రూ. 1.2 లక్షల కోట్లకు చేరిందని మోదీ స్పష్టం చేశారు. భారతదేశం నుంచి కార్లు, బైకులు మాత్రమే కాకుండా.. మెట్రో కోచ్‌లు, ట్రైన్ కోచ్‌లు, లోకోమోటివ్‌ల రవాణాను పెంచాలని అన్నారు.
ఇదీ చదవండి: టెక్ దిగ్గజం అతిపెద్ద డీల్.. నెలకు రూ.5.4 కోట్ల రెంట్!
భారతదేశం ఎదగాలంటే.. అనుకున్నది సాధించాలంటే, దిగుమతులపై ఎక్కువ ఆధారపడకూడదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విదేశాలలో లభించే పరిజ్ఞానం బాగానే ఉండవచ్చు, కానీ దేశ దీర్ఘకాలిక స్థితిని నిర్ణయించేది మాత్రం స్వదేశీ ఆవిష్కరణలేనని అన్నారు. సొంత పరిజ్ఞానం అలవాటు చేసుకోవాలని మోదీ సూచించారు.