
ప్రముఖ టెక్ దిగ్గజం తన కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త ఆఫీసులను ప్రారంభిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ ఇండియా ఆర్ అండ్ డి హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఫీనిక్స్ సెంటారస్‌లో 2.65 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఇక్కడ 3, 4వ అంతస్తులలో ఆఫీస్ ఉంటుంది.
టేబుల్‌స్పేస్ టెక్నాలజీస్‌తో ఒప్పందం ఐదు సంవత్సరాలు కాగా.. నెల అద్దె రూ. 5.4 కోట్ల చొప్పున చెల్లిస్తుంది. ఇది 2025 జులై 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్ స్టాక్ వెల్లడించింది. ఈ ఒప్పందానికి స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలుగా టెక్ దిగ్గజం రూ.92.94 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.
లీజు పత్రాల ప్రకారం.. మొత్తం చెల్లింపు చదరపు అడుగుకు రూ.67 బేస్ అద్దెతో పాటు.. నిర్వహణ ఛార్జీలు, నిర్వహణ ఖర్చులు, మూలధన ఖర్చులు, నిర్వహణ రుసుములు ఉన్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది అద్దె 4.8 శాతం పెరుగుతుంది. కాగా కంపెనీ ఐదేళ్ల కాలానికి రూ.42.15 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చేసింది.
ఇదీ చదవండి: భారత్‌లో మొదటి ఆఫీస్: ఓపెన్‌ఏఐలో జాబ్స్
హైదరాబాద్‌లో ఇతర భారీ ఆఫీస్ డీల్స్
హైదరాబాద్‌లోని ఇతర భారీ డీల్స్ విషయానికి వస్తే.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2024లో 10.18 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. దీని అద్దె నెలకు రూ. 4.3 కోట్లుగా ఉంది. అదేవిధంగా, డిసెంబర్ 2024లో, ఫేస్‌బుక్ తన హైదరాబాద్ ఆఫీస్ స్థలం కోసం లీజును రెన్యువల్ చేసింది. ఇది మొత్తం 3.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీని అద్దె నెలకు రూ.2.8 కోట్లు.