 
															పునీత్ దాల్మియా
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో కూడా అమోదం పొందడాన్ని పరిశ్రమవర్గాలు స్వాగతించాయి. ఇది సాహసోపేతమైన నిర్ణయంగా పేర్కొన్నాయి. దీనితో అక్కడ పెట్టుబడులకు అవకాశం లభిస్తుందని, ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుందని పేర్కొన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దుచేయడం చరిత్రాత్మకమైనదని అసోచాం ప్రెసిడెంట్ బీకే గోయెంకా చెప్పారు. దేశమంతటా ఒకే రాజ్యాంగం అమలయ్యేందుకు ఇది దోహదపడగలదన్నారు. దీనితో జమ్మూ కశ్మీర్‌లోని టూరిజం, రియల్ ఎస్టేట్, హస్తకళలు, హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లోకి పెట్టుబడులు రాగలవన్నారు. అపార సహజ వనరులు, ప్రతిభావంతులు ఉన్న జమ్మూ కశ్మీర్ సమగ్ర అభివృద్ధికి తాజా పరిణామాలు దోహదపడగలవని సీఐఐ ప్రెసిడెంట్‌గా ఎంపికైన ఉదయ్ కొటక్ తెలిపారు. ఇక జమ్మూ కశ్మీర్‌లో పెట్టుబడులపై కార్పొరేట్ వర్గాలు దృష్టి పెడతాయని, దీనితో రాబోయే అయిదేళ్లలో స్థానిక యువతకు గణనీయంగా ఉద్యోగావకాశాలు లభించగలవని దాల్మియా భారత్ గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా చెప్పారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
