మార్చి వరకు కొత్త కొలువులు అంతంతే: అసోచామ్‌

Assocham Opinion on jobs - Sakshi - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ నిదానంగానే ఉంటుందని అసోచామ్‌ అభిప్రాయపడింది. బ్యాలెన్స్‌ షీట్లను చక్కదిద్దుకోవడం, ఖర్చులను క్రమబద్ధీకరించుకునే పనిలో ఉండటమే ఇందుకు కారణాలుగా అసోచామ్‌ సర్వే పేర్కొంది.

కార్పొరేట్‌ రంగం తన శక్తినంతా వేతనాలు సహా ఖర్చులను క్రమబద్ధీకరించుకోవడంతోపాటు బ్యాలెన్స్‌ షీట్లను రుణ రహితంగా మార్చుకునేందుకు వినియోగిస్తోందని, ఈ నేపథ్యంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగ నియామకాలు 2018–19 సంవత్సరం ప్రారంభమయ్యే వరకు నిదానంగానే ఉంటాయని పేర్కొంది.

రుణాలను తగ్గించుకోవడం, ప్రాధాన్యేతర వ్యాపారాల నుంచి తప్పుకోవడం, బ్యాలెన్స్‌ షీట్లను సరళంగా మార్చుకోవడం, మార్జిన్లను పెంచుకోవడంపైనే కార్పొరేట్ల దృష్టి ఉన్నట్టు తెలిపింది.  దేశ సౌర్వభౌమ రేటింగ్‌ను మూడీస్‌ పెంచినప్పటికీ, రానున్న రెండు క్వార్టర్లు ప్రైవేటు రంగానికి సవాలేనని, అధిక రుణ భారం, వినియోగదారులు తక్కువ వ్యయం చేయడం వంటి సమస్యలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి తేలిక పడొచ్చని అసోచామ్‌ జనరల్‌ సెక్రటరీ డీఎస్‌ రావత్‌ అభిప్రాయపడ్డారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top