
సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే
న్యూఢిల్లీ: ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో సీనియర్ యాజమాన్యం వైపు నుంచి ఏవైనా తీవ్రమైన ఉల్లంఘనలు చోటుచేసుకుంటే వాటిపై తప్పక దృష్టి సారిస్తామని సెబీ చైర్మన్ తుహిన్‌కాంత పాండే ప్రకటించారు. రూ.3,400 కోట్ల మేర ఖాతాల్లో మోసాలపై ఆరోపణలు రావడం తెలిసిందే. ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో సమస్యలను ఆర్‌బీఐ చూసుకుంటుందని.. సెక్యూరిటీస్ మార్కెట్ నిబంధనల ఉల్లంఘనలను సెబీ పరిశీలిస్తుందని పాండే స్పష్టం చేశారు.
అసోచామ్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు పాండే పై విధంగా బదులిచ్చారు. మోసంలో కొందరు ఉద్యోగుల పాత్ర ఉందన్న అనుమానాన్ని ఇండస్‌ఇండ్ బ్యాంక్ బోర్డు వ్యక్తం చేస్తూ.. దీనిపై దర్యాప్తు సంస్థలు, నియంత్రణ సంస్థలకు నివేదించాలని యాజమాన్యాన్ని కోరడం గమనార్హం. డెరివేటివ్‌లు, సూక్ష్మ రుణాల పోర్ట్‌ఫోలియోలో మోసాలు వెలుగు చూడడం తెలిసిందే.
సీనియర్ ఉద్యోగుల పాత్ర ఉందంటూ అంతర్గత ఆడిట్ తేల్చడంతో ప్రస్తుతం ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతోంది. ఖాతాల మోసాల్లో సీనియర్ యాజమాన్యం పాత్ర ఉండొచ్చంటూ బ్యాంక్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచి్చంది. ఇప్పటి వరకు ఆడిటింగ్, దర్యాప్తులో గుర్తించిన లోపాలను మార్చి త్రైమాసికం ఫలితాల్లో పేర్కొన్నట్టు ఇండస్‌ఇండ్ బ్యాంక్ తెలిపింది. డెరివేటివ్‌లో అక్రమాలకు సంబంధించి రూ.1,960 కోట్లను గుర్తించడంతోపాటు, తప్పుడు లెక్కలకు సంబంధించి రూ.674 కోట్లను రివర్స్ చేయడం గమనార్హం. మార్చి త్రైమాసికానికి బ్యాంక్ రూ.2,329 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.
ఎన్‌ఎస్‌ఈ ఐపీవో సవాళ్లకు చెక్
స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ పబ్లిక్ ఇష్యూకి అడ్డుగా నిలుస్తున్న సమస్యలు త్వరలో పరిష్కారంకాగలవని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. కొన్ని అంశాల కారణంగా నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్‌ఎస్‌ఈ) ఐపీవో ప్రతిపాదన సెబీ వద్ద పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
కీలక యాజమాన్య వ్యక్తులకు చెల్లించిన పరిహారం, టెక్నాలజీ, క్లియరింగ్ కార్పొరేషన్‌లో మెజారిటీ ఓనర్‌షిప్ తదితరాలకు పరిష్కారం లభించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలనూ తొలగించేందుకు ఎన్‌ఎస్‌ఈ, సెబీ చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అసోచామ్ ఏర్పాటు చేసిన ఒక సదస్సులో పాండే ఈ విషయాలు వెల్లడించారు. ఇందుకు గడువును ప్రకటించనప్పటికీ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలియజేశారు. ఎన్‌వోసీ కోసం సెబీకి ఎన్‌ఎస్‌ఈ తిరిగి దరఖాస్తు చేసిన నేపథ్యంలో పాండే వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది.