
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో రూ 11,400 కోట్ల కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకులపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీఎస్‌యూ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాజకీయంగా ఈ చర్య ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న జైట్లీ పీఎన్‌బీ స్కాం అనంతరం బ్యాంకుల ప్రైవేటీకరణపై ప్రజల్లో చర్చ మొదలైందని చెప్పుకొచ్చారు.
బ్యాంకుల ప్రైవేటీకరణపై విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం అవసరమని, చట్ట సవరణలు ( బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్) చేపట్టాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. దీనికి రాజకీయ పార్టీలపై ఒకే వైఖరి అవసరమని, పీఎస్‌యూ బ్యాంకుల ప్రైవేటకీరణకు రాజకీయంగా ఏకాభిప్రాయం కుదిరేపని కాదని అన్నారు. ఇది సవాల్‌తో కూడిన సంక్లిష్ట నిర్ణయమని జైట్లీ అన్నారు.